పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

శమన! నీ యాజ్ఞలోనివారము కటాక్ష
వీక్షమముఁ గావు మేమని విన్నవింతు
మనిన నాధర్మరాజు న్యాయంబుఁ బూని
యతనిదుర్వృత్తి కలుగుచు నప్పు డనియె.

199


వ.

ఓరీ! దురాత్మా! నారాయణాచలంబునుండి వచ్చిన విప్రుని నారాయణ
పరాయణుండైనవానిం దిరస్కరించితి వది యెఱుంగుదువో? యెఱుం
గవో? పద్మారమణపాదాబ్జవాసితతులసీదళంబు లతం డర్పించిన నది
గైకొనవైతి వది యెఱుంగుదువో? యెఱుంగవో? ఓరి పాపాత్మా!
బాలకుం డధ్వపరిశ్రాంతుండై యుండ నద్విజోత్తముం డబ్బాలునకై
యన్నంబు వేఁడిన నవమానంబు చేసితి వది యెఱుంగుదువో? యెఱుం
గవో? కవాటవేగహతుండై పడి బాష్పవ్యాకులేక్షణుండైన హరిరాత
బాలకుం గరుణింపవైతి వది యెఱుంగుదువో? యెఱుంగవో? రాజ
కృప గలిగి గర్వించి శంఖచక్రాదిధారణంబు నిందించితి వది యెఱుం
గుదువో? యెఱుంగవో? ముక్తిమార్గోపదేష్టలగు మునులవచనంబుల
ప్రమాణంబు లంటివి మూఢ! యవి యెఱుంగుదువో? యెఱుంగవో?
వేదంబులు నారాయణుండె వరదేవత యన వైవర్ణ్యం బొందితి వది
యెఱుంగుదువో? యెఱుంగవో? నిత్యంబును రాజగోష్ఠియందు నాస్తిక
ప్రశంసయు, సాధుదూషణంబును నొనర్చితి వది యెఱుంగుదువో?
యెఱుంగవో? ఇన్నియు నేటికి? రాజసభను శరణాగతరక్షాధర్మంబు
దూషించితి వది యెఱుంగుదువో? యెఱుంగవో? యని పలికిన
బ్రాహ్మణుం డంగీకరించి కంపంబు నొంది యీమహాపాపం బెట్లు తరిం
తునో యని మఱియు మఱియుఁ బాదంబులం బడిన శమనుం డాతని
కిట్లనియె.

200


క.

ఈయఘముల కే నెఱుఁగుదుఁ
బ్రాయశ్చిత్తంబు విష్ణుభక్తులయెడ న
శ్రేయముగఁ జేయునవమతి
పాయక నిష్కృతియు లేదు పాపంబునకున్.

201


ఆ. వె.

అనిన మఱియు మఱియు నడుగులపైఁ బడి
కంప మొందువిప్రుఁ గాంచి నీదు
మరణవేళ నేడుమాఱులు గోవింద
యనియె విష్ణురాతుఁ డతులకరుణ.

202