పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇట్లు ప్రతిదినంబును జతుర్విధాహారంబులు మెండుకొనియుండఁ
బ్రయత్నంబున నాగతులగు వైష్ణవుల భుజియింపంజేయుచుండె. ఆ
యతిథిపూజలో సుముఖి యేపాత్రంబులు వాడె నాపాత్రంబు సౌవర్ణంబు
లును, రాజతంబులునై వెలసె. సన్న్యాసి భుజించినయెడ నిరవధియైన
నిధి గానవచ్చె. సన్న్యాసివేషంబున నారాయణుండు వేదంబులు శిష్య
రూపంబు లై వెంటం జనుదేర నేతెంచెనఁట. పాషండివారణోద్యోగంబునఁ
ద్రిదండిధరరూపంబు గాంచి మున్ను విజృంభించు దత్తాత్రేయుండని
మీ రెఱుంగుదురు. నారాయణపరాయణుం డెవ్వనిగృహంబున భుజించు
నాతనిగృహంబున సాక్షాత్కారమున నారాయణుండు భుజించు.

190

భాగవతాపచారముచే చతుర్వేది మహాపదలపా లగుట

సీ.

ఆచతుర్వేది పిత్రాద్యర్చనము సేయు
                       నపుడు పయఃపాత్రమందు విషముఁ
గ్రక్కె నొక్కమహోగ్రకాలాహి, భోజనా
                       నంతరంబున మృతులైరి భోక్త
లావిప్రుఁడును భార్య యాత్మజులును దాను
                       పానభోజంబున బ్రతికి రంతఁ
దద్విజాత్మజులు పౌత్రకులంగణములందుఁ
                       జాటిరి పైతృకాచరణ విషము


తే. గీ.

చేత గరళంబు పెట్టి భజించె దుష్ట
శీలుఁడై ద్విజుఁ డంచు నాక్షితి సురేంద్రుఁ
బట్టి దట్టించి రా రాజభటులు కశల
మర్మములు దూలి యీల్గె నాదుర్మదుండు.

191


క.

మేధావి వనము చొచ్చి తి
రోధానము నొంద ఘోరరూపంబగు వ్యా
ఘ్రాధివతి మ్రింగెఁ గొందఱు
భూధరమున కెక్కఁబోయి భువిఁ బడునంతన్.

192


వ.

తల్లియు జిహ్వాచ్ఛేదంబొనర్చుకొని పరానుత్వంబు నొందె.

193


తే. గీ.

అతనికన్యక లిరువు రత్యంతభీతి
రాజదండభయమున ద్వారంబునందు
ననలశిఖ లుంచి మడిసి రట్లాపురంబు
నణఁగెఁ దద్విష్ణురాతుగేహంబుదక్క.

194