పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అని మఱియు నాకుం బన్నిద్దఱు నందనులు హరిద్వాదశనామంబులవారు,
వారి పేరు లోకంబునఁ బ్రసిద్ధంబగు. నేను నారాయణున కంటె సన్య
దేవతను భజింప, మద్భార్యయు నీవ్రతంబె యాచరించునది– అని
విష్ణురాతుండు తననడక విన్నవింపఁ బుత్రాన్వితుండై హరిరాతుండు
తద్గృహంబునకుం జనియె.

185


తే. గీ.

విష్ణుభక్తగృహావాసవిభవమహిమ
విష్ణుభక్తులకే తగి వెలయుచుండు
క్షీరశర్కరలునుబోలెఁ, గ్రూరసంగ
మంబు విషనింబదళమేళనంబుఁ బోలు.

186

శ్రీహరి సన్యాసివేషంబున అతిథియై వచ్చి యనుగ్రహించుట

వ.

అంత విష్ణురాతుని భార్య సుముఖి యనునది పరమసాధ్వి కలశంబున
నుదకంబు పట్టి పుత్రుండును, దానును మజ్జనంబాడి హరిరాతుండు
మాధ్యాహ్నికకృత్యంబులు దీర్చి నారాయణప్రీతిగా నైవేద్యంబు
నివేదించునప్పుడు శిష్యచతుష్కంబుతోఁ జరమాశ్రమి యొక్కఁడు
చనుదెంచె. ఆగృహస్థుండు నయ్యతిథిని వాసుదేవునింబలెం బూజించి
మ్రొక్కి పాదపరిమార్జనంబుఁ గావించి యహో భాగ్య మహో భాగ్య మని
తత్పాదతీర్థంబు శిరంబునం జల్లుకొనిన సన్న్యాసియు, నతని శిష్యులు
నలువురును, అతిథియు నతని పుత్రుండు నేకపంక్తిని భుజియించు
చున్నతఱి నావిష్ణురాతుని బాలుం డొకం డాఁకొని తండ్రికడకు వచ్చి
రోదనంబు సేయందొడంగె.

187


మ.

సుముఖిం గన్గొని యన్న మీఘటములో శోధింపవే యంచుఁ ద
ద్రమణుం డాడిన, సాధ్వి లేదు కబళార్థంబైన నంచున్ యథా
ర్థముగాఁ బల్కె, మనోహరుండు మఱియున్ దర్జించి శోధింపు మ
న్న ముదం బొప్పఁగఁ జూడ నన్నపరిపూర్ణంబై ఘటం బుండినన్.

188


ఆ. వె.

బ్రాహ్మణోత్తముండు పన్నిద్దఱును సుతుల్
తాను సతియు మనసు తనివి దీఱ
నారగించిరప్పు డత్యంతసంతోష
పూర్ణహృదయులై యపూర్వమహిమ.

189