పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

కలుగదు క్రోధము లోభముఁ
గలుగదు గర్వంబు మదముఁ గలుగదు హరిభ
క్తులకుఁ బ్రదీపముక్రిందట
నిలుచునె ఘోరాంధకారనిచయం బెల్లన్.

177


శా.

క్రూరాభీలభుజంగ నాకు కుహరక్రోడంబులో నున్న దు
ర్వారజ్వాల సముల్లసచ్ఛిఖిశిఖాగ్రశ్రేణిలోనున్నఁ గాం
తారవ్యాఘ్రగుహాంతరాళబిలమధ్యశ్రేణిలోనున్న మేల్
[1]సేరన్ వచ్చుటకన్న భక్తజనతాశ్రీనిందకావాసమున్.

178


తే. గీ.

ధరణిఁ బిత్రార్థకల్పితధనము వ్యయము
సేయరాదండ్రు బుధులు చర్చించిచూడ
న ప్రధానవ్రతం బిది యనుచు నపుడె
దూరతరముగ ధర్మంబు తొలఁగిపోవు.

179


తే. గీ.

బ్రాహ్మణోత్తముఁ డిట్లేఁగఁ బరమహర్ష
పూర్ణుఁడై పైతృక మొనర్చె భూసుపర్వుఁ
డర్థమును విద్య రాజమాన్యతయుఁ గలుగ
యుక్తము నయుక్తము నెఱుంగ నొకనివశమె?

180

విష్ణురాతుఁడు కావించిన భాగవతారాధనము

చ.

అలసి యశక్తుఁడై ద్విజకులాధముసేఁతకు రోసి వీటిలో
వెలయఁగ నూర్ధ్వపుండ్రముఁ, బవిత్రభుజాయుగశంఖచక్రము
ద్రలు, నలినాక్షమాలికయుఁ దాల్చిన తద్ధరణీసురోత్తముం
గలుషవిదూరుఁ గాంచి కుతుకంబున భూసురుఁ డొక్కరుం డటన్.

181


తే. గీ.

బ్రాహ్మణోత్తమ! పే రేమి? బాలుఁ డేమి
గావలయు? నేఁడు మనసులోఁ గలఁగినట్లు
గానుపించితి నాకు నిక్కముగఁ దెలుపు
మనిన సర్వము నెఱిఁగింప నాదరించి.

182


వ.

ఆతఁ డిట్లనియె.

183


మ.

హరిభక్తాంఘ్రిసరోజరేణుకణపూతాత్ముండనై శిష్టమం
దిరధాన్యౌఘము ముష్టిమాత్రముగ నాతిథ్యంబునన్ వేఁడి సు
స్థిరభక్తిన్ నిజదారపుత్రహితులన్ దీపింపఁ బోషింపుచున్
బరమానందముఁ బొందియుండుదును సౌభాగ్యప్రభావంబునన్.

184
  1. లీరీతిన్ హరిభక్తనిందకగృహం బీక్షించుకన్న న్మహిన్.