పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

మెచ్చాయె నిచటి కేటికి
వచ్చితి వేగంబె తెలుపు వసుధామర! యే
నిచ్చట సన్మంత్రకలా
పోచ్చారణశక్తి మెఱసియుండినవాఁడన్.

173


వ.

అని బ్రహ్మబంధుండు పల్కిన నాబ్రాహ్మణుండు.

174


సీ.

అర్భకుం డధికదూరాధ్వపరిశ్రాంతి
                       నలసినవాఁ డింతయన్న మొసఁగు
మనియె నా హరిరాతుఁ డనఘ పైతృకము నేఁ
                       డర్పింపరాదని యాగ్రహించి
యనియెఁ జతుర్వేది, యన్నంబు మాన నీ
                       తండులంబు లొసంగు ధర్మబుద్ధి
నన్యగృహంబున నైనను వండించు
                       కొనియెదఁ గాని యాకొనిన యతిథి


తే. గీ.

గడపకు మటంచుఁ దద్ద్విజుఁ డడుగ నడుగఁ
దగునె పైతృకదినమునఁ దండులంబు
లైన నర్సింపననుచు గర్వాంధబుద్ధి
నాచతుర్వేది తర్జించి యాడునంత.

175


వ.

అధ్వపరిశ్రాంతి నలసి బ్రాహ్మణుండు మఱియు మఱియు వేఁడుకొన
సర్వాతిథియైన చతుర్వేది మఱియు మఱియు లేదన ధర్మం బెఱుంగుదు
విట్లేల పలికెదవు? నీగేహంబున నిడకయుండిన నీబంధుగృహంబున
నేని భుజియింపంజేయుమని యాభూసురవర్యుండు ప్రార్థింపఁ జతు
ర్వేది కృద్ధుండై నిరసించిన యేని పిశాచంబువలెఁ బలుమాఱు నడిగి
పీడించెదు. ఈనగరంబున మఱి గృహంబులు లేవె? పొమ్ము!
పొ మ్మిచ్చటఁ దొలంగుమని తర్జించినంతట నశక్తుండై పుత్రుఁడును
దానును నంగణభాగంబునం దోఁచక నిల్చిన నాచతుర్వేది తన
తనయులచేత బాహ్యభాగంబునకుం గరార్ధచంద్రక్రమంబునం
ద్రోయించి కవాటంబు బిగియించునెడఁ గవాటవేగసంభ్రాంతుండై
బాలుండు నేలంబడిన నష్టోభవ యని యాబ్రాహ్మణోత్తముండు బాష్ప
గద్గదవాక్యంబులం బలుకుచుఁ గుమారుని నెత్తికొని మేను నివురుచు
బుజ్జగించుచుండె. అప్పుడు.

176