పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

నియతభోజనంబు నిందించి మించ స
ర్వాతిథి యనువార్త నధిగమించి
భూధరాశ్రయపరిపూర్ణసంపదలచే
నతిశయంబు నొందె నాతఁ డంత.

167


వ.

అతనికి మేధావి యను పుత్రుండు ప్రథమంబునం గలిగె. అట్లనే ఘనులై
శివనామముల ముగ్గురుతనయులు పితృగుణప్రవీణులు జనియించిరి.
ఆబ్రాహ్మణుండు రాజభటద్రవ్యంబు గొని దంభంబునం బ్రతివత్స
రంబును యాగంబు గావించుచుండె. నంత నొక్కనాఁ డాతఁడు పైతృ
కం బాచరించుచుండ, హరిభక్తిపరాయణుండును, వర్ణాశ్రమాచార
నిష్ఠానియతమానసుండును, నారాయణాద్రివాసుఁ డగుటంజేసి త్రిదశ
నమస్కృతుండును, మానావమానతుల్యప్రమోదహృదయుండును
నగు హరిరాతుండనువాఁడు తద్గ్రామంబుఁ జొచ్చి వృద్ధుండు నధ్వ
శ్రాంతుండును గాన సుతునితోఁ గూడ వచ్చి వేషమాత్రావైదికుండగు
చతుర్వేదిం గాంచి బ్రాహ్మణపరివృతుండై యుండునప్పుడు.

168


క.

నారాయణదేవుపదాం
భోరుహతులసీదళములు భూసురవరకం
ఠీరవుఁ డర్పింపఁగ ని
స్సారంబుగఁ జూచి కేలు సాచక యున్నన్.

169


వ.

మఱియు నొకసారి యావిప్రోత్తముండు తులసీదళంబు లొసంగ దరియ
వచ్చిన.

170


ఆ. వె.

అంటరాకు స్నానమాడినవాఁడ నో
ద్విజకులేంద్ర! నీవు తెరువు నడచి
యంటుద్రొక్కినాఁడ వర్హంబె నీ కేల
నున్న తులసి ముట్ట నుపవసించి.

171


తే. గీ.

అనుపనీతుండు నాపుత్రుఁ డతనిచేతి
కొసఁగు, కాకున్న నీచేత నుండనిమ్ము!
తులసి లోకంబులోపల దుర్లభంబె?
యిదియు నొకవస్తువే ధాత్రి నెంచి చూడ.

172