పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మోముతో సౌమిత్రిం బిలిచి నారాయణాచలంబుననున్న హరిమూర్తిం
దెప్పింపుమనిన సౌమిత్రి యాంజనేయునిం బిలిచి తద్గిరిప్రభావంబుఁ
దెలిపి నియోగించిన నాతఁ డచ్చటి కేఁగి సేవించి వచ్చి రాఘవస్వామి
చరణంబుల కెరగి యిట్లనియె.

129

శ్రీరామాజ్ఞచే హనుమంతుఁడు యదుగిరి శ్రీహరిని పూజించుచుండుట

క.

ఈరూపము నారూపము
నేరు పఱుపరాదు, మొగము నీక్షణములు, నా
సారామృతశుభరేఖా
పారంపరి పొడవు దొడపు బాహుల నిడుపున్.

130


వ.

అనిన రామభద్రుం డిట్లనియె.

131


తే. గీ.

అనఘ నను గొల్చినట్ల యయ్యదునగేశుఁ
గొలువు నిరతంబు నత్యనుకూలభక్తి
నని నియోగింప నప్పు డాయనిలసూతి
యొనర నిప్పుడుఁ గొల్చుచు నున్నవాఁడు.

132

కనకమాలినీ యదుశేఖరుల కథ

వ.

తద్విగ్రహంబుం దెప్పించికొని రామభద్రుం డనేకసహస్రోపచారం
బులు గావించి సేవించి పరమధామంబున కేఁగుచు హనుమంతుని
చేతికి నిచ్చె, నతండు కుశునకు నర్పించె, నాకుశుండు నజకులధనం
బునుం బూజించె. అంత నాకుశునకుఁ గంఠస్థకనకమాలికలతో నొక
కన్య జనియింప బాంధవులు కనకమాలిని యని పిలిచిరి. అంత.

133


తే. గీ.

సుదతి సుకచ సునేత్రాంత సురద సుకర
సుముఖి సుభ్రూయుగ సుగంధి సురుచిరాస
సుకుచ సువలగ్న సుశ్రోణి సుదరహాన
ఘనసువర్ణాభ కనకమాలిని చెలంగె.

134


తే. గీ.

హంసగామినిఁ, బద్మవిహాసిచరణఁ,
బక్వబింబాధర, లతాంగి, భర్మకాంచి
మధుర మధురోక్తినిపుణ రమాధవాంఘ్రి
సేవనాసక్తచిత్త నాచెలువఁ గాంచి.

135