పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

పూర్ణిమాచంద్రవిస్ఫురితముఖాంబుజు
                       విలసితరత్నకుండలకలాపు
హారకిరీటకేయూరముఖ్యవిభూషు
                       సంచితవిమలాంజనాభదేహు
సర్వలోకాధికసౌభాగ్యసంపన్ను
                       భువనార్హభూషణభూషితంబు
నద్భుతాకారదివ్యాయుధపరివృతుఁ
                       దప్తకాంచనపరిధానశాలి


తే. గీ.

నాదినారాయణునిఁ గాంచి యభినుతించి
వందనముఁ జేసి రఘువంశవల్లభుండు
భూమినందన యాకర్ణపూర్ణనిర్ని
మేషదృష్టి నిరీక్షించి నెమ్మి మ్రొక్కి.

126


తే. గీ.

లక్ష్మణానీతకమలకల్హారకుముద
కుసుమములు దెచ్చి పూజించి కొన్నినెలలు
రఘుకులాధీశ్వరుండు నిరంతరంబు
సన్నిధానముల వసియింపఁ జక్రి యనియె.

127


తే. గీ.

రాక్షసానీకబాహుదర్పం బడంచి
నీ వయోధ్యకు నేతేర నిఖిలయోగి
జనులు గొల్వఁగ నిజనివాసంబునందు
నుందు నీచేతఁ దగఁ బూజ లందికొనుచు.

128


వ.

అని యనిచె నంతఁ జతుర్దశవత్సరంబులు వనంబున నుండి రామభద్రుండు
నిజనివాసంబునకు వచ్చి తనుం బాసి చనలేక విభీషణుండు పరితపింప
రంగశాయి నిచ్చి యీరంగశాయిని నన్నుంగా భావించి పూజింపుమని
యనిచె. విభీషణుం డేఁగిన రంగశాయివిరహవిషాదంబున రాఘవుండు
వైమనస్యంబు నొందఁ జతుర్ముఖుండు దివ్యవిమానం బెక్కి చనుదెంచి
రామచంద్రునిఁ జూచి పూర్వంబున నీవు నారాయణాచలంబునఁ బూజిం
చిన యచ్యుతదివ్యమంగళవిగ్రహం బున్నయది. తద్విగ్రహంబుఁ
బూజింపుమని చెప్పి ధాత నిజలోకంబున కరిగె. ఆరఘుపతి నగు