పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

హరిపాదాబ్జమునందుఁ బుట్టి నదులం దాధిక్యముం జెందితిన్
హరిభూదారశరీరసంజనిత[1]సర్వాంగీణవాఃపూర మా
వరతీర్థంబు తదద్రిపై వెలసె భవ్యశ్రీల నారాయణుం
డురుతేజంబున నుండుఁ బ్రేమ రమతో యోగీశ్వరుల్ గొల్వఁగన్.

100


వ.

అట్లౌటఁ దత్కల్యాణతీర్థంబు నాకంటెఁ బరమపవిత్రంబు.

101


సీ.

చాంద్రసరోవరస్థలమునఁ జైత్రంబు
                       నం దనంతసరోవరాంతరమున
వైశాఖమునను బావనమైన తుంగభ
                       ద్రామహాతటినీహ్రదంబునందు
ఆషాఢమున నభస్యంబున స్వామిపు
                       ష్కరిణిలోఁ దులయందుఁ గంజహితుఁడు
వఱలఁ గావేరిప్రవాహంబునందు ఫా
                       ల్గుణమాసమునఁ గోటిగుణము మించు


తే. గీ.

నట్టి కల్యాణతీర్థంబునందు నపుడు
సర్వనదు లుండు నందున సర్వఫలము
హరిపరాయణు లం దుండ్రు పరమనియతి
సకలతీర్థంబు లచ్చోట సంచరించు.

102


వ.

అనిన విని విస్మయం బంది నిజరూపంబుఁ జూపుమని విన్నవించిన
దూరదేశంబు తిరిగి యలసినవాఁడ నడువ శక్తుండఁ గాను పుత్రులు
శిశువులు. నీవే కల్యాణతీర్థంబవై ప్రవహింపుమని బ్రాహ్మణుండు
మ్రొక్కిన యమునం జూచి నగి యాదరంబున నిలిచి యుత్తుంగ
తరంగయై యున్న యాతరంగిణిం బ్రార్థించిన నన్నుఁ గల్యాణతీర్థంబుగాఁ
ద్రిరావృతంబుగా నుచ్చరించి మత్ప్రవాహంబున నవగాహనంబు
గావించిన నభీష్టంబు లభించునని యానతి యిచ్చిన నట్లనే బ్రాహ్మణుం
డొనర్చి మునింగిన యదుశైలంబును, గల్యాణతీర్థంబును, దత్రత్యులగు
మునులును గానుపించిన విస్మయము నొందె. అంత నీ వెవ్వరు? నీ విచ్చటి
కెట్లు వచ్చితి వని యడుగు మునులకు నిజవృత్తాంతంబుఁ దెలిపి యీ
స్థానం బెయ్యది యని యడిగిన వారలు యదుశైలం బని యానతి యిచ్చిన
నానందంబు నొంది శ్రీమన్నారాయణుని సేవించి తన్మహానగంబు నిజ
నివాసంబుఁ జేసికొని, నివేదితాన్నంబును భుజించుచు నచ్చట నారాయ
ణుం డను నొకపుత్రునిం గని యపరిగ్రహయావల్లబ్ధోవజీవనుండై
యాబ్రాహ్మణుండు.

103
  1. సర్వాంగిరవాఃపూర