పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అంత జాహ్నవీ కావేరీ యమునా తుంగభద్రా తామ్రపర్ణీ సరస్వతీ
శోణా గోదావరీ నర్మదా పయస్వినీ కృతమాలా ముఖ్యనదుల నవగా
హించి యొకనాఁడు నారాయణగిరిఁ జేరి కల్యాణతీర్థంబున మజ్జనం
బాచరింపక పిదప గంగకు నేఁగి గంగం గానక యెచ్చట నున్నయది
యని తత్రత్యుల నడిగిన వారు హరచూడావిభూషణయైన గంగం
గానవా యన నెంత నిర్భాగ్యుండ. అగ్రంబున నున్న గంగాప్రవా
హంబుఁ గానక యున్నవాఁడ. ఏదుష్కృతం బొనరించితినో యని విషా
దంబు నొంది హరిపాదతరంగిణిం [1]బ్రార్థించుచుఁ జింతించుచున్నంత
[2]నీలోత్పలశోభనయైన యొకకన్యారూపంబునఁ దాను భాగీరథి వచ్చి
బ్రాహ్మణోత్తమా! యేల దుఃఖించెద వని యడిగిన నతం డిట్లనియె.

95


క.

సురనదిఁ గానక యంతః
కరణంబున దుఃఖ మొంది కలఁగెద యత్నాం
తరవిఫలతకంటెఁ దదు
త్తరదుఃఖము వేఱె కలదె తామరసాక్షీ!

96


వ.

అని విన్నవించిన గంగ పాపకర్ములకుం గానఁబడ దనిన బ్రాహ్మణుం
డేను పాతకి నైతినేని మోక్షోదయంబును సుఖంబును లేదు. ఆమోక్షో
దయంబును సుఖంబును, హరిపాదనదినేని సేవించి పాపసంక్షయంబు
చేయక లభించ దనిన గంగ యిట్లనియె.

97

కల్యాణతీర్థమహిమను గంగానది సుచరితునకు చెప్పుట

శా.

గంగావాహిని నేను నాసఖియ యీకల్యాణి కాళింది స
త్సంగం బొప్పఁగ సర్వతీర్థనికరస్నాతుండవై పుణ్యరే
ఖం గాన్పించిన యాదవాచలమునన్ గల్యాణతీర్థంబునం
దుం గీర్తించి మునుంగవైతి వది దుర్దోషంబు నీ కిట్లగున్.

98


తే. గీ.

ధరణి నిటువంటి పుణ్యతీర్థం బతిక్ర
మించు దుష్పాతకమునకు మేర గలదె?
తీర్థములరాజు కల్యాణతీర్థ మింక
నీ కెఱింగింతు విను మతినిష్ఠఁ బూని.

99
  1. బ్రార్ధించినప్పుడు చింతించునంత
  2. నీలోత్పలశోభనయైన యొకకన్యయుం దాను గన్యారూపంబున భాగీరథి వచ్చి