పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

సనకాది ఘనయోగిజనవర్యులేను వె
                       న్వెంట రా నిందిరావిపులతరప
యోధరమకరికాయుక్తభుజాంతరు
                       వరదైవ మని యాత్మ నిరవు చేసి
పరిమితచ్ఛలచింతఁ బాసి నిరంతర
                       పరభక్తినియతుఁడై పద్మజాత
తనయుఁడు సేవించి తద్గిరిసంవాసి
                       సకలజనానీకసారదివ్య


తే. గీ.

వర్యసిద్ధాంజనత్రిభువనవిచిత్ర
సుకృతపాకంబు, నకృతకసూక్తి గమ్య
పరమహేశాను యదుగిరీశ్వరు నిజాత్మ
యందు భావించి హర్షించె నద్భుతముగ.

92


వ.

అంత నామునీంద్రులందఱు బదరికాశ్రమంబుననుండి నారదవాక్యంబు
విని యోమహాత్మా! భగవత్సమాగమకీర్తనంబు విని ధన్యుల మైతిమి.
శ్వేతమృత్తికాప్రభావంబును, గల్యాణతీర్థంబునకు గంగాతీర్థంబుల
కంటె నాధిక్యంబు గలుగుటయు, వరాహరూపవిష్ణుసన్నిధియుం జెప్పి
తివి. విస్తరంబుగా నానతీవే యని యడిగిన నారదుం డిట్లనియె.

93

కల్యాణతీర్థమహిమ — సుచరితుని కథ

సీ.

వినుఁడు పురాతనవృత్తాంత మోమునీ
                       శ్వరులార యొకమహీసురవరుండు
సుచరితుం డనువాఁడు సుచరితుఁ డాతని
                       భార్య సుశీల శోభనసుశీల
సుమతి సువృత్తి నామములఁ బుత్రులు గల
                       రావిప్రమణికి నాయనఘమూర్తి
సకుటుంబుఁడై కాంచె సకలతీర్థంబులు
                       సకలపుణ్యస్థానచయము సకల


తే. గీ.

పరమపుణ్యాయతనములు పాండురంగ
బదరికాశ్రమరంగ శోభన మహీధ్ర
సింహనగ కూర్మనీలాద్రి సేత్వనంత
శయన గోకర్ణ నైమిశాశ్రమ ఫణీంద్ర
శైలకాంచి కురుక్షేత్రసార మరసి.

94