పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఆవిచిత్రతఁ జూచి యౌర శ్రీనారాయ
                       ణాదిదేవుఁడు జగదద్భుతముగ
అప్రమేయప్రమేయాకారముల రెంటఁ
                       గనిపించె ననుచు వల్కలము లంతఁ
పొడవుగా నెగవైచి పొగడి నర్తింపుచు
                       వల్గనములు చేసి వందనములు
గావించి యిది యహో! కల్యాణ మిది యహో!
                       కల్యాణ మఖిలలోకము లెఱుంగ


తే. గీ.

వచ్చి వైకుంఠనగరనివాససీమ
నుండి మమ్ముఁ [1]గటాక్షింప నుత్సహించె
ననుచుఁ దత్రత్యు లానంద మంది పలుకఁ
దేజము వహించెఁ గల్యాణతీర్థ మచట.

86


తే. గీ.

తద్విమానస్థుఁ డగు రమాధవుని, విష్ణుఁ
బ్రాఙ్ముఖంబుగ నిలిపి [2]తత్పాంచరాత్ర
విధి సమర్చన మొనరించి విబుధతతికిఁ
బాదతీర్థం బొసంగెఁ దద్భక్తి మెఱసి.

87


వ.

హర్షించి సాష్టాంగదండప్రణామంబు లాచరించి కోటీరరత్నమరీచి
పూరంబుచేఁ దోరంబుగా భగవత్పాదపీఠికానీరాజనంబు లాచరించిన
భగవంతుండు సుధామనోహరంబులగు నపాంగంబుల నీక్షించి మధుర
వాక్యంబుల.

88

కల్యాణతీర్థోత్పత్తి

మ.

ఘనత న్మించు వరాహరూపమున నీక్ష్మామండలం బెత్తి యం
బునిధిన్ గ్రుంకి కలంచి లేచునెడ [3]నాపుణ్యోదబిందుచ్ఛటల్
గననయ్యెన్ జగముల్ నుతింప విలసత్కల్యాణతీర్థంబు పా
వన మాద్యంబు సమస్తతీర్థనిచయావాసంబు చర్చింపఁగన్.

89
  1. గటాక్షించ
  2. తత్పంచరాత్ర
  3. యాపుణ్యోదబిందుచ్ఛటల్