పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అని కమలనేత్రుఁ, గారుణ్యపాత్రు, శరణాగతసర్వస్వచరణు, నిందిరా
భరణు వినుతించి వెంటనంటి యలకాపురప్రాంతంబున కరుగుదెంచి
నిజశ్రవణభూషలైన వైశ్రవణభాషలం జొక్కి నిల్చె, నంత నైహిక
పరమపదంబై, మునిసమాకీర్ణంబై వెలయు బదరికాశ్రమంబుఁ జొచ్చి
మునిరూపంబులనున్న నరనారాయణుల సన్నిధానంబున సనత్కుమార
ప్రముఖమునీంద్రులు తద్విమానంబు నిలిపి రంత.

80


శా.

ఆనారాయణుఁ డమ్మహాశ్రమమునం దత్యంతమోదంబుతో
శ్రీనాథున్ దివసత్రయం బపుడు పూజించెన్ దదంతస్థులౌ
మౌనుల్ వచ్చిన మౌనులున్ సురలు నామ్నాయంబులన్, సంతత
ధ్యానం బొప్పఁగ బాహ్యదేశముల నత్యంతంబు సేవింపఁగన్.

81


వ.

అంత బదరికాశ్రమంబు వీడ్కొని చని.

82

సనత్కుమారుఁడు యాదవాద్రిపై శ్రీహరిదివ్యవిమానంబును నిలుపుట

తే. గీ.

అపుడు సర్వోత్తరం బగు నద్రి యొకటి
దక్షిణాశావిభూషయై తనరు తులసి
కాననావృతయై యున్నఁ గాంచి నలువ
తెలియఁజెప్పినజాడయై తెలివి గాంచి.

83


క.

ఇది దివ్యధామనగ మని
మదిలోఁ గనె నాసనత్కుమారుఁడు హర్షం
బొదవన్ సేనాని వినుత
మిది శేషుఁడు నిదియ హరియు నిదియే యనుచున్.

84


వ.

తత్పర్వతశిఖరమధ్యంబునఁ దీర్ఘనిషేవితంబైన యొకదివ్యతీర్థంబుఁ
గాంచి యది మహాస్థానం బంచు సర్వేశ్వరుండగు శ్రీహరి నారాధించెద
నని తలంచి తత్తీర్థతటంబునన్ బ్రహ్మార్చితంబైన విమానంబు నిల్పె.
మున్ను ధాత పూజించునెడఁ బంచలక్షయోజనప్రమాణంబగు తద్విమా
నంబు పంచపురుషమాత్రారూపంబునం గాననయ్యె. భగవంతుండును
స్వలీలచే భక్తపరతంత్రుఁడుఁ గాన తదంతఃపరిమితరూపంబునం
గాననయ్యె. ఆయుధంబులును, దివ్యభూషణంబులును విస్తారంబులు
దక్కి [1]తద్రూపానురూపస్వరూపంబులం గాంచె. అంత.

85
  1. తత్తద్రూపస్వరూపత్వంబులు గాంచె