పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నడుచునప్పుడు గాన్పించె నవ్యశార
దాంబుధర శుభ్రరూప శౌర్యాద్రిరాజ
మందునుండి యుమాజాని యరుగుదెంచి
యెదురుకొని వందన మొనర్చి యిచ్చ నలరి.

75

దివ్యవిమానస్థుఁడైన శ్రీహరియర్చామూర్తిని శివుఁడు స్తుతించుట

వ.

కల్పాంతనర్తకుండైన హరుండు నర్తించి యిట్లని వినుతించి.

76


సీ.

[1]ఆహా! జగన్నాథ! యరవిందలోచన!
                       యరుదేర నినుగంటి నాత్మ చల్ల
నయ్యె నేత్రాంబురుహంబులు వికసనం
                       బయ్యె నోస్వామి! తారాళి యెంచ
వచ్చిన ధారాళవర్షబిందువు లెంచ
                       వచ్చిన సికతాలవంబు లెంచ
వచ్చినదేవ! భవన్నాభినీరజ
                       నీరజసంభవానీకములు గ


తే. గీ.

ణింప శక్యమే షాడ్గుణ్యనిధివి నీవ
విశ్వకారణమును నీవ విశ్వలోక
సత్తముండవు నీవ ప్రసన్నముక్తి
దాయకుఁడ వీవ సకలసంధాత వీవ.

77


క.

అకలంకమహిమ నాబ్ర
హ్మ కిట [2]నిఖిలప్రపంచమంతయుఁ గ్రీడా
ర్థకలితపుత్రకు లట్లనె
ప్రకటశ్రీ నుండు నీకుఁ బరమాత్మ! హరీ!

78


మ.

నిగమాంతాధ్వమహావబోధ నిధయే నేత్రే సుధీపాలినే
భృగుజాపీనపయోధరాంక [3]మకరీస్ఫీతాంసయుక్తాయతే
జగతీశాయ కృపాబ్దయే౽విత తురాసాహే నమస్తే నమః
త్రిగుణాతీత గుణాయ సాధుసుమనోధిన్యై నమస్తే నమః.

79
  1. హాహా
  2. వివిధప్రపంచమంతయు
  3. మకరిస్ఫీత