పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

365 అయితే బ్రహ్మకు ఒకసంవత్సరం. అంటే 3 లక్షల 15వేల 410 కోట్ల మానవసంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒకసంవత్సరం గడిచినట్లన్నమాట. ఇటువంటివి 100 సంవత్సరాలైతే బ్రహ్మకు పూర్ణాయుర్దాయం. అంటే 3 కోట్ల, 15 లక్షల, 41 వేల కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మ పరమాయు వన్నమాట. కల్పాలదృష్ట్యా బ్రహ్మ పరమాయుర్దాయకాలంలో పగలు, రాత్రిళ్ళుగా పరిగణించబడే వివిధకల్పాలసంఖ్య 73 వేలకు పరిమిత మౌతుంది. ఒకకల్పానికి 432 కోట్ల సంవత్సరాల కాలమని అధర్వవేదం ఈక్రిందిమంత్రంలో విస్పష్టంగా వక్కాణించింది.

"శతంతే అయుతం హాయనాన్
ద్వేయుగేత్రీణి చత్వారి కృణ్మః
ఇంద్రాగ్ని విశ్వేదేవాస్తేను
మన్వంతా మహృణీయమానాః — (అధర్వ 8-1-2-21)

బ్రహ్మ, పద్మ, వరాహ, శ్వేతాది నామాలతో వివిధకల్పాలకు నామా లున్నట్లు కనిపిస్తున్నది. అయితే బ్రహ్మ పరమాయుర్దాయంలో వచ్చే మొత్తం 73 వేల కల్పాలకు క్రమానుగతంగా ఒకపద్ధతిప్రకారం నామాలు ఆర్షవిజ్ఞానందృష్ట్యా యేర్పడి వుండవచ్చును కాని అవన్నీ మనకు లభ్యమైనట్లు కనపడదు.

అసలు స్వాభావికంగా సృష్టే చాలా విచిత్రమైనది. సూర్యోదయ, అస్తమయాలు క్రమబద్ధంగా నిర్ణీతకాలప్రకారం జరుగుతున్నట్లు చంద్రోదయ, అస్తమయాలు క్షీణాభివృద్ధి దశలు క్రమబద్ధంగా జరుగుతున్నట్లు, అశ్విన్యాది 27 నక్షత్రాలు ప్రతి 27 రోజులకు (అధికమాసాన్ని విడిచిపెట్టి) వొక్కసారి చంద్రసామీప్యాన్ని పొందుతున్నట్లు మేషాది ద్వాదశరాసులు కాలబద్దాలై క్రమంగా తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లు భూమ్యాదిగోళాలన్నీ యితరగ్రహనక్షత్రాలన్నీ తమచుట్టూ తాము తిరుగుతూ తమ అధిదేవత చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు సృష్టిమొత్తంలో అటు స్వరూపంలోనూ, యిటు స్వభావంలోనూ సైతం ఒకానొక విచిత్రమైన చక్రనేమిక్రమంతో కూడిన పునరావృత్తిపూర్వకమైన వ్యవస్థ వున్నట్లు అగాధమైన ఆర్షవిజ్ఞానందృష్ట్యానే కాదు ఆధునికవిజ్ఞానందృష్ట్యా కూడా మనం పరిశోధన చేస్తే మనకు గోచరమౌతుంది.

"చరిత్ర పునరావృత మౌతుంది" అన్నవాక్యం సర్వసామాన్యంగా అనేకసందర్భాలలో మనందరినోటా నలిగేమాట. ఇది యేదో అలవోకగా గాని ఆషామాషిగా కాని, ఊసుపోక కాని, సృష్టించినమాట కాదు. మనం అన్నమాట మళ్ళీ అంటున్నట్లు, చేసినపని మళ్ళీ చేస్తున్నట్లు, చరిత్రలోనూ, సృష్టిలోనూ జరిగిన సంఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతూ వుంటాయి. గత 116 సంవత్సరాల చరిత్రలో అమెరికాలో జరిగిన కొన్నిసంఘటనలవిషయం యిక్కడ నేను బుద్దిపూర్వకంగానే