పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణరచనాకాలవ్యవస్థ

'శ్రుతి స్మృతి పురాణేతిహాసాలు' అన్న వాక్యం ప్రకారం శ్రుతుల తరువాత స్మృతులు వాటి తరువాత పురాణాలు అవతరించినట్లు కనిపిస్తుంది. శ్రుతు లెప్పు డవతరించాయో సాధికారికంగా చెప్పలేనట్లే స్మృతుల అవతరణ గురించి కూడా చెప్పే అవకాశంలేదు. ఇదేవిధంగా పురాణాల అవతరణ గురించి, వాటికాలం గురించి చెప్పడం ఎంత అగాధమైన పరిశోధనలు చేసినా సుసాధ్యంగా కనపడడంలేదు. పురాణశబ్దానికి పురాతనవిషయాలు చెప్పేది అని పండితవిమర్శకలోకమంతా అర్థం చెప్పుకుంటున్నది. లోతుగా పరిశీలిస్తే పురాణమంటే పురాతనకాలంలో చెప్పబడింది అని మాత్రమే అర్థమేమోనని అనిపిస్తున్నది. పురాణాల ఆవిష్కరణదశలను, గాథలను పరిశీలించినపుడు వొక్కభవిష్యపురాణమే కాదు. మొత్తం పురాణాలన్నీ భవిష్యపురాణాలుగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వొక్కనారదీయపురాణమే తీసుకొందాం. ఈనారదీయపురాణంలో విష్ణుమాహాత్మ్యంగురించి వర్ణించడంతోపాటు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జన్మాదికాలు, ప్రహ్లాదజననం, వరాహనరసింహావతారాలు ఇత్యాది విశేషాలన్నీ భవిష్యత్తులో జరుగబోతున్నాయని నారదప్రోక్తమై వున్నది. అంటే వరాహనరసింహావతారాలకు పూర్వమే - అది ఎంతపూర్వకాలంలోనో ఇదమిత్థంగా చెప్పలేము - నారదీయపురాణం ప్రోక్తమైనదన్నమాట. కాగా యిది భవిష్యద్వాణీవిలసితమేకదా!

బ్రహ్మ, పద్మ, వరాహ, శ్వేతాది కల్పాలలో, బ్రహ్మ, పద్మ, వరాహ, వాయువ్యాది పురాణాలు ఉత్పన్నా లయినాయని మత్స్యపురాణం పేర్కొంటున్నది. పురాణాలు కల్పాలలోకే ప్రవేశించాయంటే మనం ఒక అనంతప్రపంచంలో అయోమయంలో పడిపోయామన్నమాట. ఆర్షవిజ్ఞానందృష్ట్యా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు నాల్గింటినీ చతుర్యుగాలని, మహాయుగమని పేర్కొంటారు. ఈయుగాల కాలపరిమితి మానవసంవత్సరాలలో 43,20,000 సంవత్సరాలు. ఇటువంటివి 74 చతుర్యుగాలయితే ఒక మన్వంతరం. పూర్వోత్తరసంధికాలాలతో కలుపుకొని 14 మన్వంతరాల కాలం గడిస్తే ఒకకల్పంగా పరిగణన. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్యసావర్ణిక, దక్షసావర్ణిక, బ్రహ్మసావర్ణిక, రుద్రసావర్ణిక, ధర్మసావర్ణిక, రౌచ్య, భౌచ్య మనువుల అంతరకాలపరిమితి 432 కోట్ల సంవత్సరాలు. ఈసంవత్సరాల కాలమే ఒకకల్పం అనబడుతుంది. యీ 432 కోట్ల సంవత్సరాలూ బ్రహ్మకు ఒకపగలు. దీన్ని ఉదయకల్పం అని అంటారు. అనంతరం తిరిగి 432 కోట్ల సంవత్సరాలు నడిస్తే అది బ్రహ్మకు రాత్రి. దీన్ని క్షయకల్పం అంటారు. అంటే 864 కోట్ల మానవసంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు పగలూ రాత్రితో కూడిన ఒకరోజుక్రింద లెక్క అన్నమాట. ఇటువంటి రోజులు