పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీ లెక్క ప్రకారం చూస్తే 14 మన్వంతరాలలో 1008 మంది విభిన్నవేదవ్యాసులు అవతరిస్తారని భావించవలసి వున్నది. అయితే ప్రత్యక్ష, అప్రత్యక్షాది జీవితవిశేషాలతో కూడుకొన్న పరాశరసూను డై కృష్ణ ద్వైపాయన నామకుడైన వ్యాసమహర్షి కాలనిర్ణయవిషయంలో కూడా - అతనిది భారతయుద్ధకాలమేనని నిక్కచ్చిగా చెప్పలేము. పరాశరాదుల ఆయుఃప్రమాణవిషయంకూడా సందేహస్పదమైనదే. అష్టాదశపురాణాలను వ్యాసుడే రచించాడన్నా, అసలు వీటన్నింటికి మూలకర్త బ్రహ్మేయని పేర్కొన్నా, రకరకాలుగా వున్న యీపురాణాలన్నింటికి కర్తృత్వం అనేకవిధాలుగా గోచరమౌతున్నది. వీటన్నింటికి పురాణాలే ఆధారంగా వుండడం మరీ విచిత్రంగా కనిపిస్తున్నది. మత్స్య, విష్ణ్వాది పురాణాలను బట్టి చూస్తే, అసలు పురాణాల మూలకర్త బ్రహ్మ అని, ఆబృహద్గ్రంథాన్ని 18 పురాణాలుగా వ్యాసుడు సంగ్రహించి రోమహర్షణునికి చెప్పగా, ఆరోమహర్షణుడు సూతమహర్షికి చెప్పగా, సూతుడు శౌనకాదులకు చెప్పినట్లు వొకచోట కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా వాయుపురాణం వాయుప్రోక్తంగానూ, నారదీయపురాణం నారదప్రోక్తంగానూ, మార్కండేయపురాణం మార్కండేయప్రోక్తంగానూ, బ్రహ్మాండపురాణం వశిష్ఠబ్రహ్మప్రోక్తంగానూ, లింగపురాణం నందికేశ్వరప్రోక్తంగానూ, గారుడ, వరాహపురాణాలు విష్ణుప్రోక్తాలుగానూ, బ్రహ్మ, వామనపురాణాలు బ్రహ్మప్రోక్తాలుగానూ, స్కాందపురాణం స్కంద(షణ్ముఖ)ప్రోక్తంగానూ, కూర్మపురాణం కూర్మావతారప్రోక్తంగానూ, మత్స్యపురాణం మత్స్యావతారప్రోక్తంగానూ, వక్కాణించారు. ఈదృష్ట్యా అగ్నిపురాణం అగ్నిప్రోక్తంగానూ, విష్ణుపురాణం విష్ణుప్రోక్తంగానూ భావించవలసి వుంటుంది. పద్మపురాణం విష్ణుప్రోక్తమే అనుకున్నా, బ్రహ్మవైవర్తపురాణం వైవర్తబ్రహ్మప్రోక్తంగా భావించినా, మిగిలిన భాగవత, భవిష్యత్ పురాణాలు వ్యాసకృతాలని చెప్పవలసి వుంటుంది. ఇవన్నీ పురాణవిషయాలమీద ఆధారపడి చెప్పినవే అయినా, వీటి కథాకథనం ప్రకారం పరిశీలిస్తే వాయు, నారదాదిప్రోక్తత్వాలుగా పేర్కొనడంలో - లౌకికంగా ప్రస్తుతం నిజమేనని నిరూపించడానికి అవకాశాలు లేకపోయినా - ఆర్షవిజ్ఞానందృష్ట్యా మాత్రం అగాధమైన పరిశోధనలు చేస్తే నిజం లేకపోలేదేమో నని అనిపిస్తుంది. మత్స్యాదిపురాణాలను బట్టి చూస్తేనే, అష్టాదశపురాణాలకు కర్త వ్యాసుడేనన్న మాట వాస్తవంగా నిలువదు. కాగా ఆయాపురాణకర్తృత్వవిషయంలో ఆకర్తృత్వాన్ని వేరే మహర్షులకో, మనీషులకో, మనుషులకో ఆపాదించి నిర్ణయించడానికి పరిశోధకులకు యెటువంటి ఆధారాలూ లేవు. అధికారాలూ లేవు.