పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణాల కర్తృత్వం

అష్టాదశపురాణాలన్నీ క్రీ. శ. 6 శతాబ్దం ప్రాంతంలో రచించబడినాయని కొందరు భావించినా, క్రీస్తుకు పూర్వమే యీపురాణాలన్నీ వున్నాయని మరికొందరు భావించినా చారిత్రకంగా వీటికాలంగురించి సాధికారికంగా చెప్పడానికి అవకాశం లేనట్లే యీపురాణాలకర్తృత్వం గురించి ఇతమిత్థం అని సాధికారికంగా చెప్పడానికి అవకాశంలేదు. అష్టాదశపురాణాలకు కర్త వేదవ్యాసుడే అన్నమాట అలా వుండగా యీపురాణాలలో రెండుపురాణాలు మాత్రమే వ్యాసప్రోక్తాలని విస్పష్టంగా వక్కాణిస్తూ ప్రాచీనకాలంనుంచీ అనుస్యూతంగా, ఆర్యోక్తిగా ఒక కారిక నిలిచివున్నది.

"అష్టాదశపురాణేషు వ్యాసేనకథితం ద్వయం
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్"

దీనిప్రకారం అష్టాదశపురాణాలకూ, వ్యాసుడే కర్త అన్నమాట అప్రామాణికమై అతని కర్తృత్వం రెండుపురాణాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆర్ష విజ్ఞానందృష్ట్యా అసలు వ్యాసశబ్దం మహర్షినామం కాదు. వ్యాసమహర్షి అనబడుతున్న ఆమహర్షి అసలుపేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాసశబ్దం అపసవ్యవాఙ్మయమైన ఆర్షవాఙ్మయాన్ని వ్యాసం చేసి అంటే విస్తృతం చేసి సవ్యంగా రూపొందించబడడంవల్ల అది వొకసిద్ధాంతనామంగా ప్రాచీనకాలంలో రూపొందింది. వ్యాసమహాభారతమన్నా, వ్యాసకృతమహాభారతమన్నా విస్తృతం చేయబడిన, సవ్యంగా రూపొందించబడిన మహాభారతం అనే అర్థం కాని, వ్యాసుడనే వ్యక్తిచేత రచింపబడిన మహాభారతమని అర్థంకాదు. వ్యాసః అని కాని వ్యాసమహర్షిః అని కాని ప్రాచీనకాలంలో ప్రయుక్తాలయ్యాయంటే వ్యాసం (విస్తృతం) చేసినవాడు - వ్యాసం (విస్తృతం) చేసిన మహర్షి అన్న విశేషార్థాలలోనే ప్రాచీనులు ప్రయోగించారు తప్ప, కేవల నామవాచకంగా మాత్రం ప్రయోగించలేదు. అయితే ఈవ్యాసనామకులు కూడా నొక్కరుగానే లేరని, వేదవ్యాసుడు వేరని, పురాణవ్యాసుడు వేరని, మహాభారతవ్యాసుడు వేరని యింకా యింకా అనేకమంది వ్యాసమహర్షు లున్నట్లు భావించినవారు కూడా లేకపోలేదు. భాగవతాన్నిబట్టి చూస్తే ప్రతిద్వాపరయుగంలోనూ వేదవ్యాసుని పేరుమీద స్వయంభువు, ప్రజాపతి, శుక్రుడు, బృహస్పతి, వశిష్ఠుడూ, త్రివర్షుడూ, నద్వాజుడూ, మొదలైనవారు వేదవ్యాసులుగా ఆర్షవిద్యలను విస్తరింపచేసినట్లు తెలుస్తున్నది. కాగా ఒకమన్వంతరంలో 72 చతుర్యుగాలలోనూ 72 మంది వేదవ్యాసనామకులు విభిన్నవ్యక్తులు అవతరించి ఆర్షవిజ్ఞానవ్యాప్తి చేస్తారని తేటతెల్లమవుతున్నది.