పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణాలను, ఉపపురాణాలుగా పేర్కొనడంలో బద్దకించిన పండితులు, ఉపశబ్దాన్ని విడిచిపెట్టి సులభాపేక్షతో, సౌఖ్యాపేక్షతో, ఉపపురాణాలనుసైతం పురాణాలని వ్యవహరించడం మొదలుపెట్టారు. కాగా అసలు పురాణాలేవో, ఉపపురాణాలేవో విస్పష్టంగా సులభతరంగా గుర్తించడంలో పండితలోకంలోనే తికమక లేర్పడ్డాయి. ఈతికమకలనుంచి బయటపడడంకోసం పురాణాలుగా వ్యవహరింపబడుతున్న ఉపపురాణాలకూ, అసలుపురాణాలకూ భిన్నత్వం గోచరమవ్వాలనే దృష్టిలో అసలుపురాణాలకు మొదట "మహా"శబ్దాన్ని చేర్చి వ్యవహరించడం మొదలుపెట్టారు. అందువల్ల అసలు పురాణాలుమహాపురాణాలై ఉపపురాణాలు పురాణాలై కూర్చున్నాయి. వాస్తవానికి అత్యంతవిపులంగా వున్న మూలపురాణంలోని అసలువిషయాన్ని అంతటినీ సంగ్రహించి చెప్పేది ఉపపురాణమై ఉండాలి. ఈదృష్ట్యా అష్టాదశమూలపురాణాలకు, అష్టాదశ ఉపపురాణాలు మాత్రమే అవతరించే అవకాశం వున్నది. అయితే ఉపపురాణాలు అష్టాదశసంఖ్యను మించిపోయినట్లు కనిపిస్తున్నది. ఇందుకు కారణంకూడా లేకపోలేదు. వాస్తవానికి విష్ణుపురాణానికి ఉపపురాణంగా అవతరించిన, విష్ణుధర్మపురాణంలో, విష్ణుపురాణసారాంశమంతా వున్నదో లేదో చెప్పలేము. మొట్టమొదట అది అవతరించినపుడు, అది విష్ణుపురాణసారాంశప్రతిబింబకం అయ్యే అవతరించి వుండవచ్చును. తరువాతికాలంలో దానిలో కొంతభాగం శిథిలమై వుండవచ్చును. అప్పుడు మరొకపండితుడు తన కసమగ్రంగా లభ్యమైన విష్ణుధర్మ ఉపపురాణం సమగ్ర ఉపపురాణం కాదన్న భావంతో "విష్ణుధర్మోత్తర ఉపపురాణం" అన్న పేరుతో విష్ణుపురాణం ఆధారంగానే వేరొక ఉపపురాణాన్ని రూపొందించి వుండవచ్చును. కాగా విష్ణుపురాణానికి, వొకేవొక్క ఉపపురాణంగా వుండవలసిన గ్రంథం రెండు ఉపపురాణాలుగా, రెండు భిన్నగ్రంథాలుగా అవతరించి వుంటాయి. ఇదేవిధంగా అత్యంతవిపులమైన విభిన్నవిషయాలకు ఆలవాలాలైన మూలపురాణాలలోని వివిధవిషయాలను వివరిస్తూ, భిన్నభిన్నగ్రంథాలుగా, వేరు వేరు ఉపపురాణాలుగా మరికొన్ని అవతరించి వుంటాయి. అంటే ఒకానొకవిధమైన పురాణసారసూత్రబద్ధమై సమగ్రగ్రంథాలుగా అవతరించవలసిన ఉపపురాణాలు అసమగ్రాలై, సమగ్రనామక ఉపపురాణాలుగా అవతరించాయన్నమాట. ఈదృష్ట్యా ఖండఖండాలుగా అవతరించిన విభిన్న ఉపపురాణనామకగ్రంథాలు అసలు ఉపపురాణాలు కానేకావన్నమాట. అయితే మత్స్య - మార్కండేయాది అష్టాదశపురాణాలు సుసమగ్రంగా, యథాతథంగా ప్రక్షిప్తపాఠవిరహితంగా మనకు లభించాయని చెప్పలేము. కాగా, అసలైన, సరైన ఉపపురాణాలుకూడా మనకు ఉపలభ్యమానాలైనాయని చెప్పడం నిస్సందేహంగా సందేహాస్పదమైన విషయమే.