పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయాల్లో సైతం ఉత్తరభారతదేశప్రతులకూ, దక్షిణభారతదేశప్రతులకూ అనేకవిషయాలలో కేవలం పాఠాంతరాలలోనే కాదు, గ్రంథభాగాలలో సైతం విభిన్నత్వం గోచరమవుతున్నది.

వాస్తవానికి ఉపపురాణాలు 18 సంఖ్యకే పరిమితమైనా కొందరు ప్రాచీనరచయితలు కొన్నికొన్నివిశేషవిషయాలకు ప్రాధాన్య మిచ్చి గ్రంథాలుగా రూపొందించి వాటిని ఉపపురాణాలలో చేర్చివేశారు. కాగా ఉపపురాణాల సంఖ్య 18 ని మించిపోవడంలో ఆశ్చర్యంలేదు. మరుగున పడిపోయిన ఉపపురాణాలు మరుగున పడిపోగా అసలు ఉపపురాణాలే కానివ్వండి, ఉపపురాణనామక యితరగ్రంథాలే కానివ్వండి, 34 గ్రంథాలవరకూ లభించాయి. ఆది - ఆదిత్య - ఔపనస - కల్కి - కాపిల - కాళిక - గణేశ - చండికా - దేవీ - దౌర్వాస - ధర్మ - నందీశ్వర - నారద - నారదీయ - నారసింహ - పారాశర్య - బృహద్ధర్మ - బృహన్నందీశ్వర - బృహన్నారదీయ - బ్రహ్మాండ - భవిష్యోత్తర - భార్గవ - మానవ - మారీచ - లైంగ - వామన - వారుణ - వాసిష్ఠ - విష్ణుధర్మ - విష్ణుధర్మోత్తర - శివ - శివధర్మ - సనత్కుమారీయ - సాంబవంటి ఉపపురాణాలు, ఉపపురాణనామకాలు ఉపలభ్యమానాలైనాయి. వీటిల్లో మహాపురాణమైన బృహన్నారదీయం కూడా ఉపపురాణంగా చేర్చబడడం విచిత్రం.

వాస్తవానికి పురాణాలు 18 మాత్రమే కాబట్టి ఉపపురాణాలు సైతం 18 కే పరిమితం కావాలి. అంతే కాదు అష్టాదశమహాపురాణాలు యేనామాలతో రూపొందాయో అదే అష్టాదశనామాలతో అష్టాదశ ఉపపురాణాలు అవతరించడంలో ఔచిత్యమూ, యధార్థ్యతా గోచరిస్తుంది.

"మద్వయం భద్వయంచైవ బ్రత్రయం వచతుష్టయం!
 అ, నా, ప, లిం, గ, కూ, స్కాని పురాణాని పృథక్ పృథక్!

అన్న ప్రాచీనకారికప్రకారం మత్స్య - మార్కండేయ - భాగవత - భవిష్యత్ - బ్రహ్మాండ - బ్రాహ్మ - బ్రహ్మవైవర్త - వామన - వాయువ్య - వైష్ణవ - వారాహ - అగ్ని - నారద - పద్మ - లింగ - గరుడ - కూర్మ - స్కాంద పురాణాలు మాత్రమే 18 పురాణాలుగా నిలుస్తాయి. ఈ అష్టాదశమత్స్యాదినామాలతోనే 18 సంఖ్యకు మాత్రమే పరిమితమై ఉపపురాణాలు కూడా నిలువవలసి వున్నది.

అసలు అష్టాదశపురాణాలను పురాణాలనే వ్యవహరించాలి. అత్యంతప్రాచీనకాలంలో ఆవిధంగానే వ్యవహరించేవారు. "శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలు" అన్న వాక్యంలో అత్యంతప్రాచీనకాలంనుంచి కూడా మన కీపురాణశబ్దమే కనిపిస్తుంది. అయితే ఉపపురాణా లవతరించిన తరువాత ఆయా ఉప