పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమూల్యమైన అవలంబనంగా నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. ఇటీవల ముద్రితాలై మనకు లభిస్తున్న మహాభాగవతత్రిమతవ్యాఖ్యానాలే కాక వీటికి తోడు "సారార్థదర్శిని - వైష్ణవరోషణి - సుబోధిని - భాగవతప్రకాశం" మొదలైన ఇతరవ్యాఖ్యానాలుకూడా లభించాయి. ఈమహాభాగవతం ఆధారంగా భాగవతామృతం - భాగవతసందర్శం మొదలైన గ్రంథా లనేకం భాగవతగుణప్రోక్తాలుగా అవతరించాయి. ఏది యేమైనా దేవీభాగవతమహాపురాణత్వాన్ని గాని ఆర్షేయత్వాన్ని గాని నిలబెట్టడంకోసం మహాభాగవత ఆర్షేయత్వాన్ని - విష్ణుసంకీర్తన ప్రాచీనత్వాన్ని త్రోసిరాజనవలసిన పనిలేదు. ఇంతమాత్రంచేత దేవీభాగవతాన్ని ఆర్షవిజ్ఞానందృష్ట్యా తక్కువగ్రంథంగా త్రోసిపుచ్చడానికి వీలులేదు. దేవీభాగవతం కూడా అత్యంతప్రాచీనకాలంనుంచీ అత్యంతప్రశస్తి పొందినమాట వాస్తవమే. కాని ఈసందర్భంలో వున్నమాట ఒకటి చెప్పక తప్పదు. మహాభాగవతం అన్నివర్గాలప్రజలలోనూ ఆబాలగోపాలమూ ప్రశస్తి పొందింది. దేవీభాగవతం మాత్రం కొన్నివర్గాలప్రజలలో మాత్రమే ప్రశస్తి పొందింది. కొందరు పరిశోధకు లభిప్రాయపడినట్లు మహాభాగవతమే తొలుత అవతరించి అనంతరమే దేవీభాగవతం అవతరించినట్లు కనిపిస్తున్నది. మహాభాగవతంలో ద్వాదశస్కంధా లుండగా, దేవీభాగవతంలోకూడా ద్వాదశస్కంధా లున్నాయి. మహాభాగవతంలో 18000 శ్లోకాలుండగా దేవీభాగవతంలో సైతం 18000 శ్లోకాలున్నాయి. మహాభాగవతాని కసలుపేరు "శ్రీమద్మహాభాగవతం" అని మహాభాగవతానికి మొదట లక్ష్మీవాచకమైన "శ్రీ" శబ్దం వున్నది కాబట్టి దేవీభాగవతానికి మొదట "శ్రీ" శబ్దానికి మారుగా "దేవీ" శబ్దం చేర్చబడిందని కొందరు విమర్శకులు భావించారు. కాని ఇది సరికాదు. "శ్రీ" శబ్దం సర్వసామాన్యవాచకం. "శ్రీ" శబ్దం కేవలం లక్ష్మీపరమైనది మాత్రమేకాదు. దేవీపరమైనది - సరస్వతీపరమైనది కూడా. దేవీభాగవతం అసలుపేరు దేవీభాగవతం అని కానేకాదు. "శ్రీమద్దేవీభాగవతం" అని మాత్రమే. భాగవతాన్ని మహాభాగవతంగా పేర్కొన్నట్లుగానే, దేవీభాగవతాన్ని సైతం "దేవీమహాభాగవతం"గా పేర్కొన్నవారు కూడా లేకపోలేదు. అయితే ఒకటి విష్ణుమాయామయమైన కృష్ణలీలాశ్రయం కాగా, వేరొకటి పార్వతీపరమేశ్వవిలాసాశ్రయం కావడమే వీటివైశిష్ట్యం.

అష్టాదశపురాణాలలో బ్రహ్మవైవర్త - బ్రహ్మకైవర్తపురాణాలు రెండూ ఒక్కటే అని కొందరు విమర్శకుల అభిప్రాయం. ఉత్తరభారతీయులు బ్రహ్మవైవర్తమని వ్యవహరించగా, దాక్షిణాత్యులు బ్రహ్మకైవర్తమని వ్యవహరించారని వీరి అభిప్రాయం. అయితే ఒక్క బ్రహ్మవైవర్తపురాణవిషయంలోనే కాదు మిగిలిన పురాణా లన్నిటివిషయంలోనూ చివరికి రామాయణభారతాల