పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంకలనం చేసిన మహాభాగవతశ్లోకాలకు "కైవల్యదీపిక" అన్నపేరుతో వ్యాఖ్యానం వ్రాసినమాట వాస్తవమే! వ్యాఖ్యాకర్త అయినంతమాత్రంచేత, ఆవ్యాఖ్యకు మూలభూతాలైన శ్లోకాలకుకూడా కర్త కాజాలడు కదా! అక్కడక్కడా వున్న వివిధవిషయకాలైన శ్లోకాలను సంకలనం చేసి గుదిగుచ్చడం ఆశ్లోకాలమూలరచనకు, మూలకర్తృత్వానికి స్థానాన్ని ప్రసాదించదు కదా! హేమాద్రిపేరుమీద "కైవల్యదీపిక" వ్యాఖ్యను వోపదేవుడు రచించి వుండవచ్చు. ఇతరులపేరుమీద గ్రంథాలు రచించేబుద్ది వోపదేవునికి వున్నంతమాత్రంచేత - భాగవతానికి వోపదేవునికి యేదో నొకవిధమైన సంబంధం వున్నది గదా అని మొత్తం మహాభాగవతాన్ని వోపదేవుడే రచించా డనడం, మహాభాగవతం అనార్షేయ మనడానికి దుర్బుద్ధితో కుయుక్తితో వెలువరించిన భావమేతప్ప వేరు కాదు - లోతుగా పరిశీలించినపుడు మహాభాగవతవోపదేవకర్తృత్వవాదం అపహాస్యంపాలు కాక తప్పదు. గరుడ - మత్స్య - స్కందాది పురాణాలలో అనేకవిధాలుగా మహాభాగవతపురాణమాహాత్మ్యం అనేకసందర్భాలలో ప్రశంసించబడింది. వివిధపురాణాలలో వున్న ఈప్రశంస లన్నింటినీ వోపదేవుడే పరికల్పించాడంటారా? అతని తరువాత పరికల్పితాలైనాయంటారా? అస లిం తెందుకు? క్రీస్తుశకం 8 వశతాబ్దికి చివరికాలంలో జీవించారని ఏకగ్రీవంగా అందరూ ఆమోదిస్తున్న ఆదిశంకరులు మహాభాగవతానికి వ్యాఖ్య రచించారని - మహాభాగవతద్వైతవ్యాఖ్యాకర్తయైన విజయధ్వజాచార్యులు విస్పష్టంగా పేర్కొన్నారు. ఆదిశంకరాచార్యులు మహాభాగవతవ్యాఖ్య రచించారని విస్పష్టంగా వ్రాసిన ద్వైతవ్యాఖ్యాకర్తయైన విజయధ్వజాచార్యుల వాక్యాన్ని మనం త్రోసిరా జనలేంకదా. దీనిని బట్టి ఆదిశంకరులకాలానికే అంటే క్రీస్తుశకం 8 వశతాబ్దానికే మహాభాగవతగ్రంథ మున్నట్లు చారిత్రకంగా దృఢపడుతున్నదిగదా! కాగా క్రీస్తుశకం 8 వశతాబ్దినాటికే వున్న మహాభాగవతగ్రంథాన్ని క్రీ. శ. 8 వశతాబ్దికి దాదాపు 450 సంవత్సరాల తరువాతికాలంలో వున్న వోపదేవుడు రచించాడని చెప్పడం శుద్ద అబద్ధమని తేలడం లేదా! మరి గరుడ - మత్స్యాదిపురాణాలలో వర్ణించబడిన మహాభాగవతం పురాణకాలంలోనిదేకాక ఆధునికగ్రంథం యెలా అవుతుంది?

పురాణాలు రామాయణభారతాలకంటే గొప్పవి. ప్రాచీనతరమైనవికూడా. అయినా పురాణాలకంటే రామాయణ మహాభారతాలకే భారతదేశం మొత్తంలో అత్యధికమైన ప్రాచుర్యమూ ప్రశస్తీ వచ్చింది. రామాయణ మహాభారతాల తరువాత మహాభాగవతానికి లభించినంత ప్రశస్తి మరేయితరపురాణానికీ రాలేదు. ద్వైతాద్వైతవిశిష్టాద్వైతత్రిమతాలవారికీ అవలంబనాలైన బ్రహ్మసూత్రాలవలె ఉపనిషత్తులవలె భాగవతంకూడా జీవేశ్వరతత్త్వ ఆవిష్కరణలో ఒక