పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను బ్రహ్మ చతుర్ముఖాలనుంచి నాలుగువేదాలు ఆవిర్భవించాయన్న మాటను విడిచిపెడితే తనకు లభ్యమైనంతలో విశిష్టదృక్పథంతో వేదవ్యాసుడు ఋగ్యజుస్సామాథర్వభేదాలతో నాలుగువేదాలుగా విభజించినట్లు కనిపిస్తున్నది. యజుర్వేదంలో ప్రత్యేకించి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేద మని రెండు భేదా లున్నాయి. అనంతాలైన వేదాలను ఒక అనంతుడే తప్ప లేదా అనంతునివంటివాడైనా తప్ప మానవమాత్రుడు మనిషి అయినా, మహర్షియే అయినా, పూర్తిగా అవలోకన చేయడం సాధ్యంకాదు. అతిప్రాచీనకాలంలోనే వేదవిభజన జరిగిన తరువాత కూడా, మొత్తం వేదం మాట దేవు డెరుగును కాని, విభజితాలైన వాటిల్లో ఒక్కొక్కదాన్నైనా అవగాహన చేసుకొనడం మహర్షులకే కష్టసాధ్యం అయిపోయింది. కాగా వాటిని శాఖోపశాఖలుగా విభజించి కొందరు కొందరికి ఒక్కొక్కశాఖవంతున నేర్పి పరివ్యాప్తి చెందించడం జరుగుతూ వచ్చింది. కాలక్రమేణా వివిధశాఖలను అభ్యసించి పరిరక్షించేవారే కరువై పోవడంతో, అనేకవేదభాగాలకు అసలుకే మోసం వచ్చింది.

ఋగ్యజుస్సామాథర్వవేదాలు మనకు పూర్తిగా లభ్యమైనాయని కొందరు అనుకుంటున్నారు కాని అది వాస్తవం కాదు. పైలమహర్షి ఋగ్వేదాన్ని 21 శాఖలుగాను, వైశంపాయన మహర్షి యజుర్వేదాన్ని 101 శాఖలుగాను, జైమినిమహర్షి సామవేదాన్ని 1000 శాఖలుగాను, సుమంతమహర్షి అథర్వవేదాన్ని 9 శాఖలుగాను విభజించి ప్రచారం చేయడంలో ప్రవర్తకులై వర్తించినట్లు సంప్రదాయసిద్ధమైన ప్రసిద్ధి వున్నది. ఈ పైల, వైశంపాయన, జైమిని, సుమంత మహర్షులే రోమహర్షుడనే నామాంతరంగల సూతమహర్షికి వివిధపురాణాలను ఉపదేశించినట్లు వేరొకప్రసిద్ధి వున్నది.

వేదాదుల్లో విభాగాలు

లభించిన ఋగ్వేదంలో వివిధ అష్టకాలతోపాటు మండలభాగాలు కూడా వున్నాయి. లభ్యమైన కృష్ణ, శుక్ల, యజుర్వేదాలలో అధ్యాయవిభాగా లున్నాయి. అష్టాదశపర్వసంభృతమైన మహాభారతం పర్వవిభజనతో వున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే సహస్రశాఖాత్మకమైన సామవేదంలో, ఇప్పటికి లభ్యమైన కౌతుక - జైమిని - రాణాయణీయ నామకాలై మూడుశాఖలలోను ప్రత్యేకించి రాణాయణీయశాఖలో దశరాత్ర - అహీన - క్షుద్ర - ప్రాయశ్చిత్త - సత్ర - ఏకాఃభేదాలతో వివిధపర్వభాగా లున్నాయి. అంటే భారతంలో పర్వవిభజనకు సామవేదంలోని పర్వవిభజనమే మూలాధారం అన్నమాట. లభ్యమైన అథర్వవేదంలో సైతం యజుర్వేదంలో వలెనే వివిధ అధ్యాయాలున్నాయి.