పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాదిగ్రంథాలలోవున్న విభాగాత్మకాలైన ప్రాచీననామాలన్నీ ఆర్షవిజ్ఞానపరమైనవే. ఋగ్వేదంలోని అష్టకవిభాగం మర్మపూర్వకమైనది. ప్రాణపూర్వకమైనది కూడా. ఖగోళ, జ్యోతిషశాస్త్రాలదృష్ట్యా అష్టమం మర్మస్థానం, ఆయుస్థానం కూడా. అత్యంతనిగూఢాలూ ప్రాణప్రదాలూ అయిన అమూల్యవిషయాలు కొన్ని ముగిసిన తరువాత అష్టకవిభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తున్నది. మండలవిభజన వైజ్ఞానికంగా చక్రనేమిక్రమాన్ని అనుసరించి యేర్పరచినట్లు కనిపిస్తున్నది. ఋగ్వేదం "కృ" పూర్వకమైన వివిధసౌరమండలాలరహస్యాలను వెల్లడించేది కాగా, యజుర్వేదం అమృతశశికళాత్మకమై ఖగోళపరంగా పరమవైజ్ఞానికంగా శుక్ల-కృష్ణపక్షాత్మకమై ద్వివిధాలైనా విభిన్నభాగాలను దృష్టిలో పెట్టుకొని అధ్యాయాత్మకంగా అవతరించింది. సామవేదం శబ్ద - నిశ్శబ్దశక్తి సంపూర్ణమై బహుముఖ, గాన - (బహిర్గాన) - మౌనగాన (అంతర్గాన) - పర్వాత్మకమైనది. ఒకపర్వం పూర్తి అయినదంటే, ఒకపర్వం (పండుగ) అంటే ఒకానొకమహిమోత్సవం జరుపుకొన్నట్లే నన్నమాట.

"స్మృతి" జ్ఞానధారణ పటుత్వానికి సంబంధించిన జ్ఞాపకశక్తివిషయకమైనది. పురాణం అతిపురాతనతకు సృష్టిస్థితిలయాత్మకమైన ప్రకృతిస్వరూపస్వభావచైతన్యసాంకేతికచారిత్రకకథారూప మైనది. బ్రహ్మాండభాండంలో సృష్టివ్యవస్థలో యేర్పడే పరిణామాలకు, ఫలితాలకు ప్రతిబింబక మైనది. ఇతిహాస మన్నది ఏదైనా ఒకానొకవిశిష్టమైన, విచిత్రమైన వినవలసిన కథను విని చివరికి పెద్దపెట్టున కడుపుబ్బ నవ్వు పుట్టించేటటువంటిది. ఈనవ్వులో అగాధమైన వేదాంతభావం పరిగర్భితమై వుంటుంది. భారతమంతా చదివి ఉభయపక్షాలలో జరిగిన ప్రాణనష్టాన్ని - దేశభ్రష్టతను - దృష్టిలో పెట్టుకొని పాండవులకు మిగిలిన విజయఫలితాన్ని చూచినా శ్రీకృష్ణనిర్యాణానంతరం ప్రత్యేకించి అర్జునుడు, మిగిలిన సహోదరులు శక్తిహీనులై నామమాత్రులుగా మిగలడం చూస్తే "హారి, యెంత వెర్రివాళ్లురా' అని మనకు తోచి నవ్వు రాకతప్పదు. ఆజగన్నాటకసూత్రధారి నడిపినకథకు ఫలితంగా మనకు మిగిలేది భగవద్గీతామయమైన తత్త్వచింతనమే. ఇది కూడా విష్ణుమాయలో, కృష్ణలీలలో ఒకహాసం వంటిదే.

కాండ, సర్గాది విభజనలు సైతం ఒకానొకవిధమైన విశిష్టగ్రంథవిభజనను సూచిస్తూ యేర్పడినవే.

అనంతరకాలంలో కావ్యాదులలో వచ్చిన ఆశ్వాస, ఉచ్ఛ్వాస, ఉల్లాసాది విభాగాలు సైతం ఒకపెద్దకథను విన్న తరువాత “హమ్మయ్య" “హారి బాపురే” వంటి పదాల ననుకుంటూ నిట్టూర్పులు విడవడం, లేదా "భలేగా జరిగిందిరా! మహా