పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారదీయపురాణ అమృతనవనీతం

ఆర్షవాఙ్మయం

'శ్రుతి, స్మృతి పురాణేతిహాసా" అన్నది అతిప్రాచీనమై, అత్యంతసామాన్యమై, సత్యశ్రీశోభితమైన వాక్యం. అయితే శ్రుతుల వెంటనే స్మృతు లుద్భవించాయని గాని, ఆవెనువెంటనే క్రమంగా, పురాణేతిహాసాలు అవతరించాయని గాని చెప్పడానికి అవకాశం లేదు. "అనంతావై వేదాః' అన్న వేదవాక్యం ప్రకారం, వేదాలు గాని, వేదదేవులు గాని, వేదర్షులు, వేదచ్ఛందస్సులు గాని, అనంతాలు. ఆర్షవిజ్ఞానదృక్పథంతో చూచినప్పుడు వేదఋషులందరూ వేదద్రష్టలే కాని, వేదస్రష్టలు కారు. మామూలుగా పండితులైనవారు కూడా గురుముఖతః నేర్చుకునేవి కాబట్టి, గురువు నోటినుంచి ఉచ్చరించడంవల్ల వినడం ద్వారా నేర్చుకునేవి కాబట్టి, వేదాలకు శ్రుతులన్న నామం వచ్చినట్లు గతంలో భావించడం జరిగింది. వాస్తవాని కిది మూలార్థం కాదు. వేదర్షులు వేదద్రష్ట లయ్యారంటే చర్మచక్షువులైన నేత్రాలవల్ల చూడడంవల్ల కాలేదు. తమ అమోఘతపస్సంపత్ఫలితమైన దివ్యజ్ఞానంతో, శ్రోత్రేంద్రియాలతో వినుకలికారణంగానే వాటిని నేర్చుకొనడంవల్ల, అవి శ్రుతులుగా వర్ణించబడ్డాయి. ఈదృక్పథంతోనే కాక వాస్తవికదృక్పథంతో కూడా ఆలోచించినపుడు వేదాలు అపౌరుషేయాలుగా గోచరమౌతాయి. అసలు, అలౌకికమైన సంస్కృతభాషను మన ప్రాచీనులందరూ ఏకకంఠంతో 'దేవభాష' - 'అమరభాష' ఇత్యాద్యర్థబోధకాలైన వివిధనామాలతో పేర్కొన్నారంటే, వేదాలు అపౌరుషేయాలని నిర్ద్వంద్వంగా ఉద్ఘాటించినట్లే. ఆర్షవిజ్ఞానందృష్ట్యా వేదాలు అపౌరుషేయాలేనని ఆచరణపూర్వకంగా తిరుగులేనివిధంగా నిరూపించడానికి తగినమార్గాలు కొన్ని నాపరిశోధనలలో లభ్యమైనాయి. అయినపుడు యథార్థస్థితిని గుర్తించలేక, ఆర్షవిజ్ఞానం లోతుపాతులు తెలియక, “వేదాలు పౌరుషేయాలా? అపౌరుషేయాలా?" అని చర్చించుకుంటూ, చారిత్రకదృష్టితో రకరకాల ఊహాగానాలు చేస్తున్నారంటే, ఇది నేల విడిచిన సామువంటిదే కదా!

వేదాలు అనంతాలన్న మాటను అలా వుంచుదాం. వాస్తవానికి వేదం ఎంతగ్రంథమైనా, వేదం వేదమే కదా! అంటే ఏకైకమేకదా మరి. అయితే కల్పవృక్షం వలెనో, కామధేనువు వలెనో అనేకార్థదాయకాలైన ఈవేదమంత్రా