పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అద్భుతం బంది లేచి యత్యంతహర్ష
సంపద వహించె నర్తించె సంభ్రమించె
భువనభూషణమైన యంభోజనేత్రుఁ
దద్విమానంబుఁ గాంచి యాతమ్మిచూలి.

42


వ.

అంత నప్పద్మజుని విష్వక్సేనుండు విమానంబుముందఱ నిడుకొని
మన్నించి కమలారమణుండు తులసీమాలికామోదవాసనావాసితో
రస్స్థలుండు జగన్నాథుం డానందైకార్ణవంబు నిన్నుఁ [1]గటాక్షింప నరు
దెంచె భజింపు, మితండె నీకు సర్వస్వంబు, భవవార్ధితారకుండు. నీవు
చేసిన తపంబు ఫలించె నన, నగ్రంబున సేనాధిపతి నారాధించి కన్ను
లకు ఫలంబై యన్యోన్యసల్లాపంబు లాడుచు నిందిర కరసరోజంబు
లచేఁ బదంబు లొత్త స్ఫురత్కిరీటహారకేయూరమంజీరవిరాజ
మానంబై తదన్యమణిభూషణంబులచేత శోభిల్లి, చక్రాద్యాయుధంబుల
చేత విజృంభించి, వైజయంతీ[2]మాలికాభిరామణీయకంబునం గనుపట్టి
పద్మామణిపీఠంబైన శ్రీవత్సంబున రాణించి, పుండరీకధవళామ్నాయ
పుష్కరేక్షణపద్దతియై, రాకాశశాంకసౌభాగ్యపరిభావిముఖాంబు
జంబై, కంబుగ్రీవంబై, సువిస్తీర్ణకవాట[3]ఘటితోరస్కంబై, చతుర్భు
జంబై, యుదారాంగంబై, పీతకౌశేయవస్త్రంబై, సమస్తజగచ్ఛరణ్య
పదాంబుజంబైన యొకదివ్యతేజంబు వీక్షించి, తదాపాదమస్తకాంతర
సౌందర్యం బనుభవించి యాపంకేరుహోద్భవుం డిట్లని వినుతించె
నంత.

43


క.

మ్రొక్కుచు భావింపుచు మదిఁ
జొక్కుచుఁ గీర్తింపుచున్ వసుంధరఁ జిందుల్
ద్రొక్కుచు హరిపాదాబ్జముఁ
జక్కఁగఁ దలఁదాల్చి పద్మసంభవుఁ డంతన్.

44


క.

దూరమున కేఁగు పరువున
దూరంబున నుండి పరువుతోఁ జనుదెంచున్
సారెకుఁ బైవల్కల మొ
య్యారంబున [4]నెగురవైచు నానందమునన్.

45
  1. గటాక్షించ
  2. మాలికాభిరామ్యంబునం గనుపట్టి
  3. ఘటితోరస్కుండై
  4. నెగరవైచు