పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అన్నియు నీమంత్రంబునకే యనుకూలంబులగు. వ్యాపకంబులైన
మంత్రంబులు మూఁడింటిలో నిది యుత్కృష్టంబు. దీనియందు వ్యాప్య
వ్యాపకవిశేషావబోధంబు గలుగుం గాన విష్ణుగాయత్రియం దాద్యం
బీమంత్రంబు.

18


క.

ఈమంత్రశక్తి సద్గురుఁ
డేముఖ్యుఁడు తెలుప నన్యుఁ డెఱుఁగునె తెలుపన్?
భూమిన్ జాత్యంధుఁడు దా
నేమేనియుఁ జూప నెఱుఁగునే యంధునకున్.

19


క.

[1]విమలమగు శ్రీనివాస
త్వ మసాధారణము నాకుఁ దగునట్ల త్రయీ
సముదితనారాయణపద
మమిత మసాధారణంబు నయ్యె న్నాకున్.

20


క.

నారాయణనామము జి
హ్వారంగమునందు నిలుపు నతనికి నపవ
ర్గోరుఫలము తన్మంతకు
నారయ మంత్రాంతరంబు లవి యేమిటికిన్.

21


క.

నియతాత్ముఁ డగుచు భోజన
శయనాసనయానకర్మసమయముల మనః
ప్రియముగ నారాయణ యను
శ్రియఃపతిసమాఖ్య వినుతి సేయఁగవలయున్.

22


క.

ఏతన్మంత్రరహస్యము
స్వాతి సృజించెదవు సకలజగదంతరముల్
ఖ్యాతిగ నధికారాంతం
బేతెంచిన నన్ను నాశ్రయించెదు మీఁదన్.

23

బ్రహ్మదేవుఁడు అష్ఠాక్షరమంత్రావృత్తిప్రభావముచే హరపురందరాదులగు దేవతలను సృష్టించుట

క.

సారతరపరమమంత్రస
మారబ్ధావృత్తి పూని యబ్జభవుఁడు స
ర్వారంభోన్ముఖుఁడై తా
నారూఢస్థితిఁ బ్రపంచ మంత సృజించెన్.

24
  1. విమల యగు