పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

సకలనామస్తుతి సంఘటించుటకంటె
                       నారాయణాయను నామమొకటి
హరికిఁ బ్రియంబు వాక్యవిశుద్ధిదంబు శ్రు
                       త్యవలంబనంబు కామ్యప్రదంబు
సాధుకర్ణామృతసారమె వెవ్వనిజిహ్వ
                       యందుఁ దన్నారాయణాహ్వయంబు
పొడము నాతనియింట జలధికన్యకతోడ
                       నట్టి పరాత్పరుం డధివసించు


తే. గీ.

అర్థ మెఱుఁగకయేని నారాయణాహ్వ
నరుఁడు కీర్తించి భయపరంపరఁ దరించు
సద్గురూదితసారార్థసరణిఁ దెలిసి
పలుకువారల నేమని తలఁపవచ్చు.

13


సీ.

నారంబు జలమయనంబుగాఁ గలుగుట
                       సకలలోకంబులు సన్నుతింప
అక్షరము[1] జలౌఘమంతయు నారమౌ
                       నది యయనంబుగా నచ్చుపడుట
సరుఁడు విష్ణువు తజ్జనవరులు నారులు
                       వా రయనంబుగా వరలికొనుట
సకలచరాచరలోకములు నారములు వాని
                       కయనమై సౌభాగ్య మంటికొనుట


తే. గీ.

జ్ఞానశక్తిబలాదికషడ్గుణములు
నారములు వాని కయనమై నయము గనుట
అమృతమూలంబు నారాయణాహ్వయంబు
నిర్వచింపంగఁదగుఁ ద్రయీనియత మగుచు.

14


వ.

వ్యూహంబునందు వాసుదేవునికి షడ్గుణంబు లెటువలె నుండు నటువలెనే
నారాయణాహ్వయంబునందును షడ్గుణంబు లుండు. సంకర్షణాది
భేదంబు గుణాభివ్యక్తిమాత్రంబు. జ్ఞానశక్త్యాదిషడ్గుణంబులచేతను
తద్భేదంబులైన కరుణాదులచేతను పరిపూర్ణుండై శ్రీమన్నారాయణుఁ
డయ్యె. విశ్వాంతర్యామి బాలజఠరంబున జగంబులువోలె షాడ్గుణ్యో
దరం బాశ్రయించి గుణకోటులు వర్తించు. మఱియును.

15
  1. అక్షరజలౌఘ-గణభంగము