పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అనిశప్రణయరసోత్ఫు
ల్లనిజేక్షణులైన మునికులప్రవరుల నా
మునిచంద్రుఁడు బోధరసాం
చనమృదుభాషావిశేషసంపదఁ బలికెన్.

8


తే. గీ.

ఇచట మీ రున్న కారణం బేమి, మిమ్ముఁ
గాంచి చరితార్థత వహించి ఘనుఁడ నైతి
ననుచు నారదుఁ డడుగ మహర్షివర్యు
లద్భుతానందరస మాని యప్పు డనిరి.

9


సీ.

కలివేళ నతిసమగ్రతరపుణ్యక్షేత్ర
                       ములలోన ముక్తికి మూలమైన
క్షేత్ర మెయ్యది యందుఁ జేరి వర్తించెద
                       మని తలపోసి నారాయణాహ్య
పరదేవతామౌళిఁ బ్రార్థింప నారాయ
                       ణాద్రియే యుండు యోగ్యంబు మీకు
ననుచు సంక్షిప్తవాక్యమున నానతి యిచ్చి
                       విస్తరంబున జగద్విదితుఁడైన


తే. గీ

నారదుఁడు దెల్పు ననియె నా[1]నలిననాభ
భక్తిసుజ్ఞానయోగిప్రపన్నమౌని
నాయకాగ్రేసరుఁడవు నానావిచిత్ర
హరికథాలీల లెఱిఁగింపు మనఘచరిత.

10


క.

నారాయణ యోగీంద్రుఁడు
సారజ్ఞుఁడు తానె యట్లు సన్నిధి యయ్యున్
బేరెన్నిఁక యదుశైలం
బారయఁ గలిదోషహారి యగు టెట్లు ధరన్?

11


వ.

ఆయాదవశైలంబున నేయేయధికారి శౌరిం బూజించె? అచ్చటి
తీర్థంబునకుఁ గల్యాణనామం బెట్లు గలిగె? తచ్ఛ్వేతమృత్తిక యెందునం
బ్రశస్తంబయ్యె? నరసింహుం డేమి నిమిత్తంబునఁ బ్రాదుర్భవించె? ఈ
క్షేత్రంబునకు వైకుంఠవర్థనంబను పే రెట్లు సంభవించె? అయనవాసం
బున నెవఁడు విష్ణుపదం బందె? ఇచ్చట నపరాధంబు సేసినవాని కెట్టి
దుఃఖంబు ప్రాపించె? ఆనతీయవే యని పలికిన నారదుం డుత్సుకుండై
యిట్లనియె. మున్ను నేను విజ్ఞానసంచయంబైన సనత్కుమారుని వలన

  1. నలిననాభి