పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారదీయపురాణము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీమద్బృందావనవీ
థీమధ్యవిరాజమానదృఢరాసక్రీ
డామాద్యద్వల్లవయువ
తీమోహకదంబభోగతృష్ణా! కృష్ణా!

1


వ.

అవధరింపుము.

2


ఉ.

చంద్రకళాకలాపరుచిజాలముతో మహతీవిపంచికా
సాంద్రవినోదవాదనరసస్ఫురితానుభవంబుతో మహ
ర్షీంద్రుఁడు నారదుండు కమలేశపదాంబుజసేవనైకని
స్తంద్రుఁడు నిల్చె మౌనిజనసత్తములందఱు సన్నుతింపఁగన్.

3


తే. గీ.

జ్ఞానవైరాగ్యభక్తినిష్ఠాపరుండు
వేదసీమంతమౌక్తికవిమలమూర్తి
ఘనతపోరాశిసత్వైకఖని యతఁడు ర
మేశుఁ డలరార వీణ వాయించె నపుడు.

4


తే. గీ.

నలిననేత్రుఁడు సంకీర్తనమున మెచ్చి
నట్లు విజ్ఞానయజ్ఞయోగార్చనప్ర
ణామములచేత మెచ్చఁ డానంద మొంది
యట్లు గావునఁ గీర్తనం బర్హ మెచట.

5


క.

పరమరసాయన మనఁదగు
నరవరజిహ్వాపరరసనవరుచి లోకాం
తరరక్ష యాగమంబుల
నరయఁగ నారాయణాహ్వయము గమ్యంబే?

6


తే. గీ.

గరుడవాహనగుణకథాగానపరమ
గద్గదాలాపములఁ జొక్కి కడు నటించు
నారదునిఁ గాంచి హర్షవాఃపూరమగ్న
మానసంబుల నుండి శమంబు పూని.

7