పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

జను లోహో యని యద్భుతాబ్ధి మునుఁగ
న్‌సాయాహ్నరాముండు తా
దినలంకాధిపునాభికుండలిసముద్దీప్తామృతశ్రేణి ప
త్రినికాయోద్దతి తెచ్చి నిల్పెనన నెంతేఁ బొల్చెఁ బూర్వాద్రిపై
వనజాతారిరథాంగనామఖగగర్వధ్వంసియై యంతటన్.

154


మ.

పురుషోత్తంసుఁడు నేఁడు [1]తద్వ్రజవధూపుంజానురాగంబుతోఁ
బరఁగెన్ మోహము మించ మత్సుతఁ దలంపం డంచు దుగ్ధాబ్ధి ని
ర్భరభక్తిన్ జనుదెంచి తత్పదముపై వ్రాలెం గదా యన్ని వి
స్ఫురణం జంద్రిక కాయజాస్త్రసుమనఃపుంజంబుతోడం దగెన్.

155


క.

మధురాకృతితో మురళీ
మధురసుధానవధి గానమంజిమయుతుఁడౌ
నధునాతనవిధు నాతని
నధిగతపరమార్థలై యొయారము మెఱయన్.

156


వ.

సేవించి గోపిక లిట్లనిరి.

157

గోపికావిహారము

క.

ఈపంతము లీగానము
లీపలు కీకళలబెళుకు లీవింతల మే
లీపొలుపులు నీకే తగు
గోపాలక నిన్ను భక్తిఁ గొల్చెద మింకన్.

158


సీ.

వారవట్టినఁ గాకతీరు నేమైకాఁక
                       యధరామృతము జిహ్వ నానుకొనినఁ
దనువు లొక్కటిగాక తలకొనునే తృప్తి
                       కులుకు గుబ్బలి గ్రుచ్చుకొనినమాత్ర
గురి గళలంటస కరఁగకుండినఁ గాక
                       పారవశ్యంబు పైఁ బడినఁ గలదె
యనిమేషముగఁ జూపు లామతించినఁ గాక
                       బెళకించి చూచినఁ బ్రేమ యగునె


ఆ. వె.

తలఁచి తలఁచి పిలిచి పిలిచి నీపదములు
గొలిచి గొలిచి చాల నలసి యలసి
మ్రొక్కి మ్రొక్కి చొక్కి చొక్కి నీశుభమూర్తి
గాంచి కాంచి మనుట కలిమి బలిమి.

159
  1. తద్వ్రతవధూపుంజ