పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేవల మతాభిమానాలు కారణంగా భాగవత మనార్షేయమని శైవులూ, దేవీభాగవత మనార్షేయమని వైష్ణవులూ తిరస్కారభావాలను వెల్లడించారు. కాశీలో నివసించిన దక్షిణాచారప్రవర్తకుడైన గదాకాశీనాథభట్టు అనే పండితుడు "దేవీభాగవతమే ప్రామాణికగ్రంథం. మహాభాగవతం ఆర్షేయం కాదు. మహాపురాణాలలో పేర్కొనదగింది దేవీభాగవతమే," అని నిర్ణయిస్తూ "దుర్జనముఖచపేటిక" అనే పేరుతో ఒకగ్రంథాన్ని రచించి భాగవతపదువాదులకు త్రోసిరాజన్నాడు. దీనికి తగినట్లుగా మహాభాగవతగ్రంథాన్ని వ్యాసునిపేరుమీద వోపదేవుడు రచించాడే గాని అసలు వ్యాసుడు మహాభాగవతాన్ని రచించనే లేదని మరొకవాదం బయలుదేరింది. ఈవాదాలు రెండింటినీ తిరస్కరిస్తూ భట్టోజీ దీక్షితుల శిష్యుడైన రామాశ్రమపండితుడు "మహాభాగవతం అనార్షగ్రంథం కాదు. అర్షగ్రంథమే. అసలది వోపదేవవిరచితం కాదు. దేవీభాగవతం అసలు ఆర్షగ్రంథం కాదు. అనార్షం." అని నిరూపిస్తూ తిరిగి "దుర్జనముఖచపేటిక" అన్నపేరుతోనే వేరొకఖండనగ్రంథం రచించి దేవీభాగవతపక్షవాదులను తిరస్కరించాడు. ఆతరువాత వేరొకపండితుడు ఈమహాభాగవతపక్షవాదాన్ని ఖండిస్తూ దేవీభాగవత ఆర్షత్వాన్ని నిరూపిస్తూ "దుర్జనముఖపద్మపాదుక" అన్న పరిశోధనాగ్రంథాన్ని రచించాడు. మహారాష్ట్రభాషలో త్ర్యంబక గురునాథ కాలే అనే విమర్శకుడు "పురాణనిరీక్షణ" అనే విమర్శగ్రంథం వ్రాసి అందులో ఈరెండుభాగవతాల మహాపురాణత్వవిషయాలగురించి జరిగిన వాదప్రతివాదాలసారాంశాన్ని సంపూర్ణంగా ఉటంకించాడు. విద్యానిధి యోగీశ చంద్ర రాయ్ అనే విమర్శకుడు బెంగాలీలో కొంతపరిశోధన చేసి దేవీభాగవతం ఉపపురాణమేనని అభిప్రాయపడ్డాడు. బెంగాలీ సాహిత్యచరిత్రకారుడైన మణీంద్ర మోహన వసు దేవీభాగవతం మహాపురాణాలలోనిదేనని అన్నాడు. తెలుగువారిలో పెక్కురు దేవీభాగవతాన్ని ఉపపురాణంగా భావించగా తాతా సుబ్బరాయశాస్త్రిగారు మాత్రం మహాపురాణంగానే భావించారు. అయితే బృహద్ధర్మపురాణాదులు కొన్ని - ఇవి అష్టాదశపురాణాలలో చేరకపోయినా - అష్టాదశపురాణాలగురించి పేర్కొంటూ మహాభాగవత - దేవీభాగవతగ్రంథాలను రెండింటినీ అష్టాదశపురాణాలలోనివిగా పేర్కొన్నాయి. ఈదృష్ట్యా ఈరెండింటి ఆర్షేయత్వాన్ని గురించి శంకించవలసిన అవసరంలేదని కొందరు పండితులు భావించారు. అయితే మహాభాగవతం వోపదేవవిరచితమేనని అంగీకరిస్తే మహాభాగవతగ్రంథ ఆర్షేయత్వం యేవిధంగా నిలుస్తుం దన్నది సర్వసామాన్యంగా కలిగే ప్రశ్న.

క్రీస్తుశకం 1271-1300 మధ్యకాలంలో యదువంశంలో రామచంద్రుడనే నామాంతరం కలిగిన రామరాజు దేవగిరి రాజ్యాన్ని పరిపాలించాడు. అతని