పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఇతి శ్రీవాయూక్త చతుర్వింశతి సహస్ర్యాం శివసం
హితాయా ముత్తరఖండే శ్రీనర్మదామాహాత్మ్యే—"

"ఇతి శ్రీవాయుపురాణే లక్ష్మీసంహితాయా మానందకాననమాహాత్మ్యే—"

"ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే ద్వాదశసాహస్ర్యాం
సంహితాయాం బ్రహ్మాండావర్తం సమాప్తమ్"—

"పంచదశ సహస్రాణి ఖండేస్మిన్ మునినా పురా,
గ్రంథ సంఖ్యాని గదితా—
ఇతి శ్రీ వాయుపురాణం శివా
పరాహ్వయం సమాప్తమ్"—

అంటూ అనేకవాయుపురాణవ్రాతప్రతుల్లో విభిన్నాలైన గద్యలు కనిపిస్తున్నాయి. వాయుప్రోక్తం కాబట్టి ఇది వాయుపురాణంగా ప్రసిద్దిగాంచినా ఇందులో శివమాహాత్మ్యం విషయాలే అత్యధికంగా వుండడంవల్ల దీనినే కొందరు శివపురాణంగా పేర్కొనగా, మరికొందరు సమగ్ర అవలోకన చేయకుండా గ్రంథాలను సరిపోల్చి చూడకుండా ప్రత్యేకించి లింగపురాణం ఒకటున్నదన్న విషయం విస్మరించి వాయు, శివపురాణాలు విభిన్నాలని భావించడం జరిగింది. అయితే లింగపురాణాన్నే శివపురాణంగా పేర్కొన్నారేమోనని భావించడానికి కూడా అవకాశం ఉన్నది. "ఇతి వాయుపురాణే లక్ష్మీసంహితాయా మానందకాననమాహాత్మ్యే" ఇత్యాది వాయుపురాణాధ్యాయాంత్యగద్యను పరిశీలించినపుడు వాయుపురాణంలో కేవలం శివమాహాత్మ్యం మాత్రమే వర్ణింపబడలేదనీ వైష్ణవమాహాత్మ్యం విషయాలు సైతం సందర్భవశాత్తూ పేర్కొనబడ్డాయనీ స్పష్టపడుతున్నది.

మహాభాగవత, దేవీభాగవతాలు రెండింటిలోనూ మహాపురాణంగా దేన్ని పరిగణించాలన్న విషయంలో 200 సంవత్సరాలకు పూర్వమే చాలా తర్జనభర్జనలు జరిగాయి. ఈచర్చలతో వివిధపరిశోధనాగ్రంథా లవతరించాయి. ఇటువంటి అభిప్రాయభేదాలు దక్షిణభారతదేశ పండితపరిశోధకులలో సైతం పొడసూపకపోలేదు. మహాభాగవత దేవీభాగవత గ్రంథాలు రెండూ సుప్రసిద్ధగ్రంథాలే. అయినా దేవీభాగవతంకంటే మహాభాగవతం ఒక్కకవిపండితమండలిలోనే గాక ఆబాలగోపాలమూ అతిసామాన్యప్రజలలో సైతం ఒకానొకవిశిష్టమైన స్థానాన్ని సంపాదించి ప్రఖ్యాతి సంపాదించిందనడంలో సందేహం లేదు. అయినప్పటికి