పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణంలో 23000 - నారదీయపురాణంలో 22000 - గరుడపురాణంలో 19000 - పద్మపురాణంలో 55000 - కూర్మపురాణంలో 17000 - వరాహపురాణంలో 24000 - స్కాందపురాణంలో 81000 శ్లోకా లున్నట్లుగా తేలుతున్నది. అష్టాదశపురాణాల శ్లోకసంఖ్యను పేర్కొంటున్న ఈ పురాణంలో 16 పురాణాల శ్లోకసంఖ్యలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. విష్ణు, లింగపురాణాలకు సంబంధించిన నామాలు శ్లోకసంఖ్యలు పేర్కొన్న శ్లోకం లభ్యమైన వాయుపురాణంలో విలుప్తమై పోయింది. ఇది వ్రాయసగాని పొరపాటు కావచ్చును. ఏది యేమైనా అన్నిపురాణాలలోనూ రకరకాలుగా పేర్కొనబడిన, వివిధపురాణాల శ్లోకసంఖ్యలు సరియైనవని నొక్కి వక్కాణించే అధికారం యెవరికీ లేదు. సమస్తపురాణోపపురాణాలలోను సర్వసామాన్యంగా ప్రక్షిప్తగ్రంథాలు, అధికపాఠాలూ మూలచ్ఛేదకాలైన విలుప్తభాగాలూ లేవని చెప్పడానికి బొత్తిగా అవకాశం లేదు. కాగా పురాణవిషయవ్యవస్థను గురించి గాని శ్లోకసంఖ్యావ్యవస్థను గురించి గాని సాధికారికంగా మాట్లాడే అవకాశం యెవరికీ లేదు.

లండన్‌లోవున్న ఇండియా ఆఫీసులో అనేకసంస్కృతగ్రంథా లున్నాయి. ఆసంస్కృతగ్రంథాల కేటలాగులోని పురాణవిషయవివరణపట్టికను చూస్తే మనకు అనేకవిషయాలు తెలుస్తాయి. వాయుపురాణం, శైవపురాణం భిన్నపురాణాలని కొందరు భావించగా మరికొంద రివి రెండూ ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. మత్స్యపురాణంలో—

"యత్రతద్వాయవీయం స్యాద్రుద్ర మాహాన్మ్యసంయుతమ్
 చతుర్వింశత్సహస్రాణి పురాణం శైవముచ్యతే"

అని వక్కాణించబడింది. మత్స్యపురాణశ్లోకంవల్ల శైవపురాణంలో 24000 శ్లోకాలున్నట్లు విదితమవుతుండగా బొంబాయిలో ముద్రితమై ప్రకటితమైన వాయుపురాణంలోని శ్లోకాలసంఖ్య 12000 మాత్రమే పరిమితమై వున్నది. శివ, వాయుపురాణాలు ఒకటే అనడానికి వీలైన ఆధారాలు శైవసంజ్ఞాముద్రితవాయుపురాణంలో యెక్కడా లేవు. ఒకవేళ శివ, వాయు పురాణాలు ఏకైకాలైనా కాకపోయినా ముద్రితవాయుపురాణం అసలు పురాణం కాకపోవచ్చును. ఉపపురాణమై వుండవచ్చును. కాగా అది 12000 శ్లోకసంఖ్యకు మాత్రమే పరిమితమై వుండడంలో అబ్బురం లేదు. లేదా వాయుపురాణంలో ఇది ఒక భాగంమాత్రమే అయి వుండాలి.

"ఇతి శ్రీవాయుపురాణం శివాపరాహ్వయం సమాప్తమ్-"