పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతరించినట్లు మత్స్యాదిపురాణాలు వక్కాణించాయి. అయినా ఈకల్పాదివ్యవస్థలనుగాని, వివిధపురాణాంతర్గతాలైన ఆర్షవిజ్ఞాన, ఖగోళశాస్త్ర విషయాలనుగాని అంతరాంతరాల్లోకి వెళ్ళి పరిశీలించకుండా - ప్రక్షిప్తాప్రక్షిప్తాలజోలికి పోకుండా కొందరు పాశ్చాత్యపరిశోధకులు పురాణాలు క్రీస్తుశకంనాటివన్నమాట దేవు డెరుగునుగాని వాటికాలం క్రీస్తుశకం 6 వ శతాబ్దందాటి అంతకుపూర్వానికి యేపరిస్థితులలోనూ వెళ్లజాలదని, పేర్కొనడం మరీ విడ్డూరంగా కనిపిస్తున్నది. ఉత్తరధ్రువంగా ఒకఅభిప్రాయమూ - దక్షిణధ్రువంగా వేరొకఅభిప్రాయమూ ఒకరు యేదాడంటే మరొకరు కోదాడుగా వైజ్ఞానికమై స్థిరమై ప్రామాణికమైన దృక్పథం లేకుండా తమకు తోచినట్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

కొందరు ఆధునికప్రాచ్యపరిశోధకులు సైతం పురాణాల అవతరణగురించి వాటి వ్యవస్థగురించి రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు. రామాయణ భారతాలలోని విషయాలేకాక హరివంశంలో వర్ణితమైన విషయాలుకూడా కొన్ని వాయు - విష్ణు - భాగవతాది గ్రంథాలలో కనిపిస్తున్నాయి. కాబట్టి పురాణాలు భారతాది రచనలకు ప్రాచీనాలనడానికి వీలులేదని వీ రభిప్రాయపడ్డారు. వైదికగ్రంథాలలో పురాణేతిహాసాది సంజ్ఞ లున్నప్పటికి ఆపస్తంభాది సూత్రగ్రంథాలలో పురాణాలను పేర్కొన్నా వ్యాసవినిర్మితాలైన ఈ పురాణాలన్నీ ఇప్పటి నామాలతోనే పూర్వం వ్యవహరింపబడ్డాయని అభిప్రాయపడినా వీటి చరిత్ర వేదాంగాల పుట్టుకవంటిదని కొంద రభిప్రాయపడ్డారు.

అమరసింహుని కాలానికే పురాణం పంచలక్షణసమన్వితమని పేర్కొనబడడంవల్లనూ భాస, కాళిదాస, ఆశ్వఘోషాదులు పురాణజ్ఞానం కలవారుగా విస్పష్టంగా రూఢి అవుతున్న కారణంగానూ పురాణాలు క్రీస్తుశకానికి పూర్వపువని కొందరు విమర్శకులు భావించారు. వీరుకూడా పౌరాణికమైన, ఆర్ష - వైజ్ఞానిక - చారిత్రక విషయాలను లోతుగా పరిశీలించి యీ నిర్ణయానికి వచ్చినట్లు కనబడదు. అంతేకాదు. వీరు వెల్లడించిన మరొక అభిప్రాయంకూడా వున్నది. కర్మ - భక్తి - జ్ఞానమార్గాలను సులభంగా ఉపదేశిస్తూ, మధ్య మధ్య తలయెత్తుతున్న వివిధనాస్తికమతాల నణగద్రొక్కుతూ, శైవ, వైష్ణవ మతాలను విగ్రహారాధనను పరివ్యాప్తి చెందించుతూ, అవతరించిన ఈ పురాణాలు, హరివంశానికి, క్రీస్తుశకప్రారంభానికి మధ్యకాలంలో అవతరించి వుంటాయనే వీ రభిప్రాయపడ్డారు. అంతే కాదు. క్రీస్తుశకానంతరం శైవ వైష్ణవాది మతాలు పరస్పరం యుద్ధాలను ప్రకటించుకున్నకాలంలో అంటే క్రీస్తుశకం 6, 7 శతాబ్దాలలోపల ఉపపురాణాలు ఆగ్నేయస్కాందాది పెక్కుపురాణాలలోని వివిధభాగాలు అవతరించి వుంటాయనికూడా వీ రభిప్రాయపడ్డారు.