పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురించి బ్రహ్మర్షి, రాజర్షుల గోత్రక్రమాలగురించి, మన్వంతరాలగురించి, సూర్యచంద్రవంశరాజుల చరిత్రలగురించి, ఖగోళ, జ్యోతిర్మంత్రాది విషయాలతో యితరవిషయా లనేకం వర్ణించడం జరిగింది. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులలోని విషయాలు వీటిల్లో వివరంగా వర్ణింపబడినాయని పెక్కురు భావించారు. ఒకపురాణంలో వున్న విషయాలే మిగిలినపురాణాలలోకూడా వున్నాయని చెప్పడానికి బొత్తిగా అవకాశం లేదు. అయితే రామాయణ, భారతాలలో సూక్ష్మంగా పేర్కొనబడిన విషయాలు, వివరంగా యీ పురాణాలలో వర్ణింపబడినాయన్న కారణంతో, పురాణాలన్నీ, రామాయణంకంటే ప్రాచీనతరాలయిన గ్రంథా లన్నమాటను త్రోసిరా జనడమేకాక మహాభారతకాలంకంటేకూడా, తరువాతికాలంలోనే పురాణాలు సృజింపబడినాయని, యివి అతినవీనాలని కొందరు విమర్శకులు భావించారు. పురాణాలలో వొకదానిలో వున్న విషయం మరొకదానిలో లేకపోయినా, వీటన్నిటిమధ్యా ఒకానొకవిధమైన ఏకీభావాన్ని సమకూర్చే సమన్వయం అంతర్గతసూత్రదృక్పథం ఒకటి కనిపిస్తుంది. ఒకటి వాయుప్రోక్తంగా, వేరొకటి పరాశరప్రోక్తంగా, మరొకటి నారదప్రోక్తంగా, యీవిధంగానే విభిన్నపురాణాలకర్తృత్వం, విభిన్నవ్యక్తుల కున్నట్లుగా విస్పష్టంగా గోచరమౌతున్నా, సామూహికంగా యివన్నీ వ్యాసప్రోక్తాలేనని, లేదా వ్యాసవిరచితాలేనని సర్వసామాన్యంగా ఒకఅభిప్రాయం పాతుకుపోయింది. అందువల్ల వీటికర్తృత్వంగురించి విమర్శకు లెవరూ ఒకసుస్థిరమైన నిర్ణయాన్ని చేయలేకపోయారు. ఏపురాణం, యేకాలంలో పుట్టిందో యీవిమర్శకులు గుర్తించలేకపోయారు. అష్టాదశస్మృతులలోనూ దేని కదే ప్రాచీనమని కొందరు మూర్ఖంగా విశ్వసించగా ఆధునికవిమర్శకులు సైతం అవిధంగానే భావించి పురాణాలుకూడా దేని కదే ప్రాచీనమని అభిప్రాయపడి వీటికాలం భారతంకంటే అధునాతనమని అభిప్రాయపడినా వీటిల్లో పూర్వాపరత్వాలను పరిశోధకవిమర్శకులు పేర్కొనలేకపోయారు.

బ్రాహ్మణారణ్యకాలంలో పురాణశబ్దం ప్రయోగింపబడినా, ఈప్రయోగాన్ని పరిశోధకులు గుర్తించి కూడా - అసలు పురాణశబ్ధార్థాన్నే విస్మరించి - అది ప్రాచీనగాథాపరమని భావించి పురాణాలన్ని క్రీస్తుకు తరువాతివేనని చాలామంది విమర్శకు లభిప్రాయపడ్డారు. ఆపస్తంభధర్మసూత్రాలలో భవిష్యపురాణప్రస్తావన వున్నది. ఈ 18 పురాణాలసారాన్ని సంగ్రహించి వ్యాసుడు భారతాన్ని రచించినట్లు పారాశర ఉపపురాణంలో పేర్కొనబడింది. 18 పురాణాలను వ్యాసుడే రచించాడని అన్నిపురాణాలలోను, ఉపపురాణాలలోనూ కనిపిస్తున్నది. పాద్మ, వరాహ, శ్వేతాదికల్పాలలో బ్రాహ్మ - పాద్మ - వాయువ్యాది పురాణాలు