పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తప్పదు. అందువల్ల ఉపవేదాలంటూ నాలుగు లౌకికవేదాలను ప్రాచీనులు పేర్కొన్నారంటే మామూలుగా వేదాలు నాలుగన్నదృష్టితో దూరాలోచన లేకుండా ఆర్షవిజ్ఞానాన్ని విస్మరించి ఏకైకదృక్పథంతో వక్కాణించడమే జరిగింది కాని, అది వాస్తవం కాదు. అసలు వేదాలలోనే అష్టాదశవిభాగవిభజనకు, ఆస్కారం అణుమాత్రమైనా లేనప్పుడు వేదాలపై ఆధారపడి పరిమితగ్రంథాలుగా అవతరించిన ఉపవేదాలలో యీవిభజనకు అసలే అవకాశం లేదు. కాగా, అష్టాదశదేవగణాలమీద ఆధారపడి వేదాలను అష్టాదశవేదాలుగా విభజించడానికి అవకాశం లేదని స్పష్టపడుతున్నది. అయితే స్మృత్యాదిలౌకికగ్రంథాలు, అష్టాదశదేవగణవిభజనను దృష్టిలో పెట్టుకొని 18 భేదాలుగా అవతరించినట్లు తేటతెల్లమౌతున్నది. కాగా, పురాణ, ఉపపురాణాలు సైతం అష్టాదశసంఖ్యకు పరిమితం కావడం ఆర్షవిజ్ఞానందృష్ట్యా సమంజసమైనదీ, సత్యసమ్మతమైనదీ కాగలదు.

పురాణాలు - ఉపపురాణాలు

పురాణాలగురించి, ఉపపురాణాలగురించి ప్రాచ్యపాశ్చాత్యపండితులనేకమంది వివిధ పరిశోధనలు చేసి, అనేకాభిప్రాయాలు వెల్లడించారు. శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలన్న వాక్యంప్రకారం శ్రుతిభిన్నాలైన ఆర్షవిషయకగ్రంథాలను త్రోసిరాజని స్మృతులతరువాత పురాణాలు స్థానం సంపాదించాయన్నమాట అక్షరాలా యథార్థం. అయితే అనంతరకాలంలో చతుర్దశవిద్యలలోను - కొందరిమతంలో చతుర్దశకళలలోను, పురాణాలు ఒకటిగా పేర్కొనబడ్డాయి. అత్యంతపురాతనాలైన విషయాలను పెక్కింటిని తెలియచేసేవి కాబట్టి వీటికి పురాణాలన్న నామం వచ్చిందని అందరూ అభిప్రాయపడ్డారు. రామాయణం కావ్యం కాగా, భారతం ఇతిహాసం కాగా, యీరెండింటికీ భిన్నమై శ్రుతి, స్మృతి భిన్నాలైన లౌకికకవితావాఙ్మయం పురాణవాఙ్మయంగా పేర్కొనబడింది. రామాయణ, మహాభారతాలవలె మిత్రసమ్మితాలుగా శ్రవణ, పఠనవ్యవహారాలలో సార్వజనీనకాలై ప్రఖ్యాతి గాంచాయి ఆర్షవిజ్ఞానాత్మకాలైన యీ పురాణాలు, ఉపపురాణాలు.

"సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వన్తరాణిచ
వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణమ్॥"

అని సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితాలు వర్ణింపబడిన గ్రంథాలుగా లక్షణం చెప్పబడింది. పంచలక్షణాత్మకాలైన పురాణాలకు మాత్రంగానే పేర్కొనబడిన పైలక్షణాలు, ఉపపురాణాలకుకూడా వర్తిస్తాయి. ఈలక్షణాల కనుగుణంగానే పురాణాలలో పూర్వసృష్టి, స్థితిలయాల గురించి, పునస్సృష్టి దేవతావంశక్రమాలను