పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠం - గయలో మాంగల్యగౌరీపీఠం - మధుర, కాళహస్తి, మాణిక్య, వాసరపట్టణాలలో వున్న శక్తిపీఠాలకు మారుగా కొందరు, మయూరపురంలో ఏకనీరికాంబాపీఠం - ద్రాక్షారామం (తూర్పు గోదావరిజిల్లా) లో మాణిక్యాంబాపీఠం - ఉజ్జయినిలో మహాకాళీపీఠం - కాశ్మీరంలో సరస్వతీపీఠం - అన్న నాలుగుపీఠాలను పేర్కొంటున్నారు.

స్మృత్యుపస్మృతులు మొదలు బహుముఖవాఙ్మయరూపంలోను, ప్రకృతిరూపంలోనూ మాత్రమేకాక పవిత్రదైవీయాలైన తీర్థశక్త్యాదులరూపంలో సైతం అష్టాదశసంఖ్యయే ప్రాధాన్యం వహించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాని, ఆర్షవిజ్ఞానం దృష్ట్యా, అమూలాగ్రంగా అవలోకన చేస్తే యిందులో ఆశ్చర్యపడవలసిన దేమీ కనిపించదు.

మన ప్రాచీనవేదర్షులు తమదివ్యజ్ఞానంతో అనంతమైన ఖగోళవేధ చేసి సృష్టిస్వరూపభావాలను గుర్తించి వీటికి మూలభూతమైన విభిన్నదైవీయాలైన శక్తులను గుర్తించారు. మహావిష్ణువు మొదలు రకరకాలుగా అవతరించిన బహుముఖాలైన విభిన్నశక్తులుగల దేవగణాలు మొత్తం 18 వర్గాలుగా వున్నట్లు తమ అమూల్యపరిశోధనల ద్వారా గుర్తించి ప్రకటించారు. అమర - సిద్ధ - సాధ్య - గరుడ - కిన్నర - కింపురుష - గంధర్వ - యక్ష - విద్యాధర - భూత - పిశాచ - రుద్ర - ఉరగ - ముని - తుషిత - దైత్య - భాస్వర - గుహ్యక - గణాలుగా యీదేవగణాలను పేర్కొన్నారు. వివిధదేవగణాలు 18 వర్గాలుగా వున్నాయి కాబట్టి వీటికి భిన్నమైన, అతీతమైన గణవర్గశక్తు లేవీ లేవన్న నిశ్చితాభిప్రాయంతో, దివ్యజ్ఞానంతో పరమవైజ్ఞానికంగా 18 గా విభజించి పేర్కొనడం జరిగింది. ఈ అష్టాదశదేవగణాలలో భూత, పిశాచాలతోపాటు, దైత్యగణంకూడా చేరడం చాలామందికి ఆశ్చర్యసంభ్రమాలను కలిగించవచ్చును. కాని, యిందులో అనార్షేయమూ, అవైజ్ఞానికమూ, అవాస్తవికమూ, అయిన విషయమేమీలేదు. వేదవిజ్ఞానందృష్ట్యా రాక్షసులు, భూతపిశాచాలు వాస్తవానికి దేవగణాలే. కారణాంతరాలవల్ల తాము చేసిన దుష్కర్మలఫలితంగా వివిధదేవగణాలలోనివారే దైవీయాలైన శాపశక్తులపాలై రాక్షస, భూతపిశాచాలుగా అవతరించడం జరిగింది. ప్రాచీనగ్రంథాలలో అనేకసందర్భాలలో రాక్షసులను "పూర్వదేవతలుగా" పేర్కొనడం జరిగింది. పూర్వదేవతలు అంటే మొట్టమొదట దేవతలుగానే వుండి కర్మవశాత్తు తరువాత రాక్షసత్వం పొందినవారని అర్థం. అందువల్లనే విభిన్నాలైన బహుముఖదైవీయశక్తులు కేవల వివిధదేవగణాలపరం మాత్రమే కాకుండా రాక్షసులకుకూడా సంక్రమించడం జరిగింది. అదేవిధంగా భూత, పిశాచాలకు సైతం విభిన్నశక్తులు సంప్రాప్తమవడం జరిగింది. అయితే దైవీయాలైన అనంతశక్తులతో అన్నీ అందరివద్దా వుండాలని యెక్కడా