పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0400-3 రామక్రియ సంపుటం: 11-597

పల్లవి: ఇంట నున్నవారము నే మెందు వొయ్యేము
         దంటల మై నిన్ను నేము తప్పు వట్టెమా

చ. 1: నివ్వటిల్ల నీకన్నుల నిద్దుర దొట్టి వున్నది
       పవ్వళించ రాదా పానుపుమీఁద
       చివ్వన న న్నేల నీవు చేయి వట్టి తీసేవు
       దవ్వుల మాతోడిపొందు తప్పి పోయినా

చ. 2: ఆసురుసు రెల్లా నీయంగముపైనే వున్నది
       విసరించుకో రాదా వేగినంతాను
       రసికుఁడ మ మ్మేల రతికిఁ బిలిపించేవు
       వెస నెప్పు డైనా నిన్ను వెగ్గళించేమా

చ. 3: వేడుకలు నీ కెపుడు వెల్లివిరిసి వున్నవి
       వీడె మింద రాదా వెర పేఁటికి
       ఆడెనె శ్రీవెంకటేశ అలమేల్‌ మంగను నన్ను
       కూడితివి యిఁక నీకు గురి దప్పీనా