పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0399-3 రామక్రియ సంపుటం: 11-591

పల్లవి: నిన్ను మెచ్చుకొనేవో నానేరుపు మెచ్చేవో కాని
         పన్ని నీవూడిగానకు ప్రౌడఁ జుమ్మీ విభుఁడ

చ. 1: చెక్కులు నీవు నొక్కఁగ చిత్తము గరఁగెఁ గాక
       యెక్కువ కోప మెం తందు నిందాఁకను
       తక్కరీఁడవు నౌదువు తగవరిని నౌదువు
       చక్కఁ జాయకు రా నేను జాణఁ జుమ్మీ విభుఁడ

చ. 2: బాసలు నీవు సేయఁగఁ బరిణామ మాయఁ గాక
       యీసు నీపై నే మందు నిందాఁకను
       ఆస చూప నెరుఁగుదు ఆదరించ నెరుఁగదు
       రాసి కెక్క నీ కిచ్చకురాలఁ జుమ్మీ విభుఁడ

చ. 3: మచ్చిక నీవు గూడఁగ మరి నే లో నైతిఁ గాక
       యెచ్చుకుందు లెంచుకోవా యిందాఁకను
       అచ్చపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       తచ్చి కూడితిని మేలుదానఁ జుమ్మీ విభుఁడా