పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0399-2 సామంతం సంపుటం: 11-590

పల్లవి: తరుణి నైనా నేను దయ లేనిదాననా
         వెరవుతో నీ వుండఁగా వేగిరింతునా

చ. 1: మొగము చూచి నాకు మందట నిలుచుండఁగా
       పొగరుముంపున నిన్నుఁ బో మ్మందునా
       నిగిడి నీవొళ్లఁ దొల్లి నేర మేమి గలిగినా
       పగటున నప్పు డట్టె పంగింతునా

చ. 2: మంచివానిలె నాతో మాట లిట్టె యాడఁ గాను
       చంచలించి నిన్ను వద్దు చాలు నందునా
       యెంచుకొని నీ వెవ్వతెయింట నుండి వచ్చినాను
       మంచ మెక్కి యింక నీతో మారుకొనేనా

చ. 3: కడుఁ జుట్టమ వై నన్నుఁ గాఁగిటిలోఁ గలయఁగా
       జడిసి వేడుక చెల్లించక వుందునా
       అడరి శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       వడి నన్నుఁ గూడితివి వాసులు వట్టుదునా