పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0399-1 సాళంగం సంపుటం: 11-589

పల్లవి: ఆఁడువార మే మనేము అట్టె నీ వేమి సేసినా
         నేఁడు పుణ్యపాపాలు నీచేతిది గాకా

చ. 1: నగుతానె ఆపెనూ నన్నునూ వాదులు వెట్టి
       పగ సాదించితిగా పంతగాఁడా
       తగవులు చెప్పె నంటా దగ్గరించి మావలపు
       తగిలించుకొంటివి గా తక్కరికాఁడా

చ. 2: మచ్చిక నే మాడెటిమాటలు వేలుచుకొని
       కుచ్చితాలు సేసితిగా కొయ్యకాఁడా
       కొచ్చి కొచ్చి నీ మీఁదఁ గోరి యాన లెల్లాఁ బెట్టి
       తెచ్చితిగా నీయింటికి దిమ్మరీఁడా

చ. 3: వాసులు మాకు నెక్కించి వద్దఁ బాయకుండఁ జేసి
       సేసలు వెట్టితివిగా సిగ్గరీఁడా
       ఆసల శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       నాసరి నాకెఁ గూడితి నాఁటకీఁడా