పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0398-5 కొండమలహరి సంపుటం: 11-587

పల్లవి: మఱచినవారి నేల మఱవ నియ్యవు మమ్ము
         వెఱచినవారి నేల వెఱపించ నేఁటికే

చ. 1: నీకుఁ గట్టినట్టితాళి నీమారు సేసుకొని
       యేకచిత్తమున నే నింట నుండఁగా
       పైకొని పిలిపించేవు పడఁతుల నంపి నన్ను
       దీకొని మమ్మింత సేసి దిమ్ము రేఁచ వలనా

చ. 2: సేస వెట్టిన నీరూపె చిత్తములో నించుకొని
       పోసరించి పొద్దు గడపుచు నుండఁగా
       ఆస చూపి నీవు నాకు నప్పటి సన్న సేసేవు
       వాసితో నుండినవారి వలఁ బెట్ట వలెనా

చ. 3: తప్పక చూడఁగ నీకు దగ్గరనె నిలుచుండి
       దప్పులనుఁ బెడఁబాసి తని వొందఁగా
       అప్పుడె శ్రీవెంకటేశ అలమేల్‌‌మంగను నన్ను
       ముప్పిరిగా నిట్టె కూడి మోహించ వలెనా