పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0397-6 రామక్రియ సంపుటం: 11-582

పల్లవి: ఆతని మంచితనము అట్టె నా మంకుఁదనము
         ఘాతల నే నెంచుకొంటేఁ గరఁగీ నామనసు

చ. 1: యింటివాకిటఁ దా నుండి యిట్టె నన్నుఁ బిలువఁగ
       అంటఁ గాక వున్నదాన ననిపించితి
       బంటువలెఁ దా వాకిటఁ బవళించి వుండఁగాను
       మంటమారితనమున మాటలాడ నైతిని

చ. 2: పానుపుమీఁదికి వచ్చి పైఁ జేయి వేసితేను
       ఆన వెట్టి నిద్ర వచ్చీ నని తోసితి
       దానికిఁ గోపించుకోక తతి గాచు కుండఁగాను
       లేనగవుతోఁ గొంత లేచి మొక్క నైతిని

చ. 3: బలిమి శ్రీవెంకటాద్రిపతి నన్నుఁ గూడఁ గాను
       మెలుపున నాచేయి మీఁదు సేసితి
       అలమేలుమంగ నేను ఆతఁడే నన్ను మెచ్చఁగా
       కిలకిల నవ్వుకొంటా కిన్నెర మీఁటితిని