పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0397-1 దేసాళం సంపుటం: 11-577

పల్లవి: వెఱవకు నిన్ను నంత వేసరించను
         నెఱి నీగుణములు నే నెఱఁగనా

చ. 1: చనవు సేసుక నే నీసరుసఁ గూచుంటిఁ గాక
       ననుపు చెప్పుక నీతో నవ్వ వచ్చేనా
       వెనకటివాఁడవా నీవిధము నే నెఱఁగనా
       చెనిక నీతో నేరమి సేసుకొనేనా

చ. 2: కపట మెఱఁగనా కతలు చెప్పితిఁ గాక
       నెపమున వావులు నే నీకుఁ జెప్పేనా
       కపురుమొకదాకిరి గడించ నీకు వచ్చునా
       యిపు డిట్టె నీకు దా యెస పెట్టేనా

చ. 3: కైవసము గాఁగా నిన్నుఁ గాఁగిట నించితిఁ గాక
       భావ మెఱఁగక నిన్నుఁ బైకొనేనా
       శ్రీవెంకటేశుఁడ నే మెచ్చి తలమేలుమంగను
       నీవే నే నని కాక నీక మొక్కేనా