పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0395-5 శంకరాభరణం సంపుటం: 11-569

పల్లవి: ఏమియుఁ గొలుప వింక నేఁటి మాటలూ
         యీమన సెల్లఁ గంటిమి యిఁక నేటి మాటలు

చ. 1: వున్నతి నీ హరములు వొకతెమెడ నుండఁగ
       నెన్నుకొంటి విందాఁక నేటి మాటలు
       నిన్ను సతు లెల్లాను నేరము లెంచే దెల్లా
       నిన్నిటాను సరి వచ్చె నిఁక నేటి మాటలు

చ. 2: మేలిమి వింతవాసన మేన నీవు నించుకొని
       యేల న న్నొడఁబరచే వేఁటి మాఁటలు
       పాలించి యాపెకు నీవు బాస లెల్ల నిచ్చి వచ్చి
       యీలీల ముచ్చట లాడే విఁక నేఁటి మాఁటలు

చ. 3: నవ్వుతా నొకతెతోడ నంటు సేసితి విందాఁక
       యివ్వల నన్నుఁ బిలిచే వేఁటి‌ మాటలు
       రవ్వగా శ్రీవెంకటేశ రతి నన్నుఁ గూడితివి
       యెవ్వతెతోడుత నీకు నిఁక నేఁటి మాటలు