పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0395-3 సామంతం సంపుటం: 11-567

పల్లవి: ఇయ్యకో లయినమీఁద నిఁక నేలా
         నెయ్యము లాతఁడు నాపై నెరపీఁ జూడరే

చ. 1: యెన్నినేరా లైనఁ గానీ యెక్కడ నైనా నుండనీ
       వన్నెగా నేర మ్మంటే వచ్చెఁగా తాను
       మన్ననలు నా కిచ్చె మాఁటలూ నాచేత వినె
       మున్నిటి సుద్దులిం కేమీ ముదులకించకురే

చ. 2: యెం దైనా సన్న సేయనీ యెవ్వ తైనాఁ గూడనీ
       యిందు నాపై నాన వెట్టె నిప్పుడే తానూ
       అంది నాపైఁ జేయి వేసే నంతరగ మెల్లఁ జెప్పె
       నింద లాడేమాట లెల్ల నిలువఁ బెట్టకురే

చ. 3: మన సెట్టైనై నుండనీ మంతనాలె యాడనీ
       కొన కెక్క నను నేఁడు గూడెఁగా తాను
       యెనసెను శ్రీవెంకటేశ్వరుఁ డీతమితోడ
       నను పైతి మిద్దరము నవ్వులు నవ్వకురే