పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0394-6 సామంతం సంపుటం: 11-564

పల్లవి: సరవు లెరఁగ మయ్య చాలు నింత కోపము
         కరగించి సొలసితే గర్వ మనేవూ

చ. 1: కందువలుగా నీకుఁ గతలు నేఁ జెప్పఁ గాను
       అంది నీమీఁద బెట్టుక అట్టె నవ్వేవు
       యిందు రమ్మనుచు నిన్ను నింటికిఁ బిలచుకొంటే
       యెందో పో నియ్య ననుచు నెమ్మె చూపేవూ

చ. 2: వద్ద నుండి సతులను వారి వీరిఁ జూపితేను
       అద్దో నింద లాడె నంటా నాన వెట్టేవు
       తిద్దుకో కస్తూరిబొట్టు తెర దిగ వేయు మంటే
       గద్దించి యట్టె నన్నుఁ గాఁగిలించేవూ

చ. 3: పూస గుచ్చినట్టు నీకు బుద్దులు నేఁ జెప్పితేను
       ఆసతో నామోవి మోవి నందుకొనేవు
       వానితో శ్రీవెంకటేశ వడి నన్నుఁ గూడితివి
       రాసి కెక్కితి వంటేను రతికిఁ దీసేవూ