పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0394-5 సామంతం సంపుటం: 11-563

పల్లవి: అటువంటివాఁడవా అద్దో నీవు
         నటన మొకమోటాలు నడుపేవు గాకా

చ. 1: తలఁపులోపల నీకు తగులు గలిగితేను
       అలరి రా కుండుదువా అక్కడ నీవు
       చలముల నెవ్వతో జాగులఁ బెట్టుక నిన్ను
       వెలి లోను మఱపించి వెఱ్ఱిఁ జేసెఁ గాకా

చ. 2: కడుఁ దమకము నీకుఁ గమ్మి పెరరేఁచితేను
       అడరి నాతో మాట లాడ కుందువా
       వడి నెవ్వతో నిన్ను వాకట్టు గట్టుక యింత
       ముడి వెట్టి విడిచి తా మొప్పెఁ జేసెఁ గాకా

చ. 3: తటుకన నన్నుఁ గూడేదయ నీకు లే కుండితే
       ఘటన నెదురుకొని కాఁగిలింతువా
       యిటువలె శ్రీవెంకటేశ కడపలోన
       సటల కెవ్వతో నిన్ను చండి సేసెఁ గాకా