పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0394-3 ముఖారి సంపుటం: 11-561

పల్లవి: ఒద్ద నున్నదాన నేను వొక్కటి గాఁ దాడవా
         దిద్దుకోఁ గలమా ట్టెల్ల తేరుచుకొ మ్మనవే

చ. 1: తన మేలే కలితేను తాపముఁ బాసేఁ గాక
       ఘనుఁడు నిన్నే లంపె యిక్కడికి నేఁడు
       మనసుతో నున్నదాన మారుమాట లాడేనా
       మనుపటివారి బాస ముగియించు మనవే

చ. 2: యేకత మైనవేళ యిట్టె నే వచ్చేఁ గాక
       యీకడ మాయింటికిఁ దా నేల వచ్చీనే
       చేకొలఁదిదాన నేను చిత్తము నొప్పించేనా
       పై కొన్న వారి పొందులపని దీర్చు మనవే

చ. 3: నే వెట్టినట్టిదాన సేవలు సేసేఁ గాక
       ఆస నేల వేఁడుకోనీ నప్పటిఁ దానూ
       వేసరక నన్నును శ్రీవెంకటేశ్వరుఁడు గూడె
       రాసి కెక్కె నీవలపు రవ్వ మాను మనవే